
న్యూఢిల్లీ: ర్యాంకింగ్స్‌లో వెనుకబడిపోయినా పదును తగ్గని ఆటతీరుతో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో మరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన పురవ్ రాజాతో జత కట్టిన 44 ఏళ్ల పేస్ అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్–పురవ్ రాజా ద్వయం 7–6 (7/4), 7–6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
గత ఆగస్టు నుంచి కలిసి ఆడుతున్న పేస్–పురవ్‌లకు ఇదే తొలి టైటిల్. మరోవైపు ఈ సీజన్‌లో పేస్‌కిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. ఇంతకుముందు ఆదిల్ షమస్దీన్ (కెనడా)తో కలిసి పేస్ లియోన్, ఇక్లే ఓపెన్ టైటిల్స్‌ను... స్కాట్ లిప్‌స్కీ (అమెరికా)తో కలిసి తలహసీ టైటిల్‌ను సాధించాడు. తాజా విజయంతో డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పేస్, పురవ్ పురోగతి సాధించారు. పేస్ మూడు స్థానాలు ఎగబాకి 67వ ర్యాంక్‌లో... పురవ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 61వ ర్యాంక్‌లో ఉన్నారు. రోహన్ బోపన్న 15వ స్థానంలో కొనసాగుతుండగా... దివిజ్ శరణ్ 51వ ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment