పేస్ పయనమెటు?
►వెంటాడుతున్న వరుస వైఫల్యాలు
►రెండేళ్లుగా లేని ఏటీపీ డబుల్స్ టైటిల్
సాక్షి క్రీడావిభాగం వరుసగా ఏడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడు... మరో విజయం సాధిస్తే డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలిచిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు... నాలుగు పదుల వయసు దాటినా ఏమాత్రం తగ్గని ఉత్సాహం... 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్... 27 ఏళ్లుగా అలుపెరుగని ఆట... 114 మంది భాగస్వాములతో కలిసి బరిలోకి... ఇలాంటి ఎన్నో ఘనతలు భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ సొంతం. కానీ కొన్నాళ్లుగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూ ట్‌లో పేస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొత్త కొత్త భాగస్వాములతో కలిసి టోర్నీలలో ఆడుతున్నా టైటిల్స్ మాత్రం దక్కడంలేదు. ఒకానొక సమయంలో పేస్ ఆటకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చినా... వాటిని అతను ఖండిస్తూ, తనలో ఆటపట్ల ఆసక్తి ఉన్నంత కాలం టెన్నిస్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
43 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌నెస్ సమస్యలు లేకుండా ఆడుతున్న పేస్ ఏటీపీ సర్క్యూట్‌లో టైటిల్ సాధించి రెండేళ్లు దాటిపోయింది. చివరిసారి అతను 2015 జనవరిలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. అదే ఏడాది మరో రెండు టోర్నీల్లో, గత సంవత్సరం మరో రెండు టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్నా పేస్ ఖాతాలో మాత్రం టైటిల్ చేరలేదు. ఈ ఏడాది ఆరు టోర్నీల్లో ఆడిన పేస్... నాలుగింటిలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. దుబాయ్ ఓపెన్, డెల్‌రే బీచ్ ఓపెన్ టోర్నీలలో మాత్రం సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.
అవకాశం దక్కేనా...
డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. 42 విజయాలతో నికోలా పిట్రాంగెలి (ఇటలీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పేస్ సమం చేశాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భగా పేస్‌కు ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం వచ్చినా... విష్ణువర్ధన్‌తో జతకట్టిన అతనికి విజయం దక్కలేదు. దాంతో ప్రపంచ రికార్డుకు పేస్ వచ్చే నెలదాకా వేచి చూడాలి. ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో పేస్ ఉంటాడా లేదా అనే అనుమానం కలిగినా సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఆరుగురు సభ్యులతో కూడిన జట్టులో డబుల్స్ స్పెషలిస్ట్‌లుగా పేస్‌తోపాటు రోహన్ బోపన్నకు స్థానం కల్పించారు. కానీ నలుగురు సభ్యులు ఉండే తుది జట్టును ఎంపిక చేసే అధికారాన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతికి ఇచ్చారు.
తుది జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు, ఒక డబుల్స్ ప్లేయర్ ఉంటారని మహేశ్ భూపతి ప్రకటించడంతో... పేస్, బోపన్నలలో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశముంది. పేస్‌తో కలిసి డబుల్స్‌లో ఆడటం ఇష్టం లేదని రియో ఒలింపిక్స్ సందర్భంగా బోపన్న ప్రకటించడం వివాదాస్పదమైంది. భారత టెన్నిస్ సంఘం జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చినా రియో ఒలింపిక్స్‌లో పేస్–బోపన్న జంట తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
ఉజ్బెకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే తుది జట్టును ఈ నెలాఖర్లో మహేశ్ భూపతి ప్రకటించే అవకాశముంది. తాను ప్రపంచ రికార్డును అందుకోవాలంటే పేస్‌కు బోపన్నలాంటి అనుభవజ్ఞుడైన భాగస్వామి అవసరం. ఒకవేళ పేస్‌ను కాదని బోపన్నను భూపతి ఎంపిక చేసుకుంటే మరోసారి భారత టెన్నిస్‌లో వివాదం రాజుకోవడం ఖాయం. డేవిస్ కప్ పోటీలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించాక పేస్‌కు తుది జట్టులో స్థానం దక్కని దాఖలాలు లేవు. ఒకవేళ పేస్‌కు స్థానం లభించకపోతే ఈ టెన్నిస్ దిగ్గజం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
తొలి రౌండ్‌లోనే పరాజయం
ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో డెల్‌పొట్రో (అర్జెంటీనా)తో జతకట్టిన పేస్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ‘వైల్డ్ కార్డు’తో ఆడిన పేస్–డెల్‌పొట్రో జంట ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో 3–6, 4–6తో సామ్ క్వెరీ (అమెరికా)–గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండు సెట్‌లలో ఒక్కోసారి పేస్ ద్వయం తమ సర్వీస్‌ను కోల్పోయింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా పేస్–డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయారు.