
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కెరీర్‌లో 55వ డబుల్స్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. అమెరికాలో జరుగుతున్న విన్‌స్టన్ సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో పేస్–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో పేస్–సెరెటాని 6–4, 2–6, 10–8తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)లపై గెలిచారు. ఈ విజయంతో పేస్ తన కెరీర్‌లో 97వసారి డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఇప్పటివరకు 54 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన పేస్... 42 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో పేస్ జంట తలపడుతుంది. వాస్తవానికి పేస్ ప్రస్తుతం ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సింది. అయితే తనకు సరైన భాగస్వామిని ఇవ్వనందుకు నిరసనగా అతను ఆసియా క్రీడల నుంచి వైదొలిగి ఈ టోర్నీలో ఆడుతున్నాడు.