ATP challeger tournment
-
రిత్విక్ జోడీకి రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్
రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో శనివారం రిత్విక్–బాలాజీ జోడీ 6–3, 2–6, 12–10తో థియో అరిబెగ్ (ఫ్రాన్స్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రితి్వక్–బాలాజీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్ మనీ, 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
రన్నరప్‌గా నిలిచిన అనిరుధ్-విజయ్ సుందర్ జోడీ
ఫ్రాన్స్‌లో జరిగిన క్వింపెర్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో అనిరుద్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ 6–7 (4/7), 3–6తో గినార్డ్–రిండెర్నెచ్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓడిపోయింది. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అనిరుద్–విజయ్ జంట ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో పోటీపడి తొలి రౌండ్లో నిష్క్రమించింది. -
సాకేత్, వినాయక్ ఓటమి
పుణే: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, కాజా వినాయక్ శర్మతోపాటు హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని 6–3, 5–7, 4–6తో ఎర్గిల్ కిర్కిన్ (టర్కీ) చేతిలో... వినాయక్ శర్మ 2–6, 1–6తో సెమ్ ఇల్కెల్ (టర్కీ) చేతిలో... అనిరుధ్ 3–6, 2–6తో రొబెర్టో ఒల్మెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, శశికుమార్ ముకుంద్ రెండో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
మాడ్రిడ్ ఓపెన్ ‘మాస్టర్’ నొవాక్ జొకోవిచ్
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 క్లే కోర్టు టోర్నీలో మూడో సారి చాంపియన్‌గా నిలిచాడు. గ్రీస్ యువతార సిట్సిపాస్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–4, 6–4తో గెలిచాడు. విజేత జొకోవిచ్‌కు 12,02,520 యూరోల (రూ. 9 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ కెరీర్లో ఇది 33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. ఈ విజయంతో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. -
సెమీస్‌లో దివిజ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. జర్మనీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 6–3, 10–8తో కెవిన్ క్రావిట్జ్–ఆండ్రియా మీస్ (జర్మనీ) జంటపై గెలుపొందింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన దివిజ్ జంట రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత తమ సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో ఫిలిప్ ఓస్వాల్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జంటతో దివిజ్–మార్సెలో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో ఓస్వాల్డ్–పావిక్ 6–4, 6–4తో మూడో సీడ్ కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)లపై గెలిచారు. -
97వసారి డబుల్స్ ఫైనల్లో పేస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కెరీర్లో 55వ డబుల్స్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. అమెరికాలో జరుగుతున్న విన్స్టన్ సాలెమ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో పేస్–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో పేస్–సెరెటాని 6–4, 2–6, 10–8తో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)లపై గెలిచారు. ఈ విజయంతో పేస్ తన కెరీర్లో 97వసారి డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇప్పటివరకు 54 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన పేస్... 42 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో పేస్ జంట తలపడుతుంది. వాస్తవానికి పేస్ ప్రస్తుతం ఇండోనేసియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సింది. అయితే తనకు సరైన భాగస్వామిని ఇవ్వనందుకు నిరసనగా అతను ఆసియా క్రీడల నుంచి వైదొలిగి ఈ టోర్నీలో ఆడుతున్నాడు. -
పోరాడి ఓడిన సాకేత్
అస్తానా: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్‌లోని అస్తానాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 4–6, 7–6 (12/10), 5–7తో డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 13 ఏస్‌లు సంధించడంతోపాటు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. క్వార్టర్స్‌లో ఓడిన సాకేత్‌కు 3,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 50 వేలు)తోపాటు 18 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రజ్నేశ్‌కు తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టైటిల్ సాధించాడు. చైనాలోని యానింగ్ నగరంలో ఆదివారం ముగిసిన కున్మింగ్ ఓపెన్‌లో ప్రజ్నేశ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్నేశ్ 5–7, 6–3, 6–1తో మొహమ్మద్ సఫత్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. గంటా 52 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అద్భుత ఆటతీరు కనబర్చిన ప్రజ్నేశ్ చివరకు విజేతగా నిలిచాడు. రెండేళ్ల క్రితం పుణే ఓపెన్ ఫైనల్లో ఓడిన అతను ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ఈ విజయంతో రూ. 14.30 లక్షల ప్రైజ్‌మనీతో పాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు అతని ఖాతాలో చేరాయి. దీంతో నేడు విడుదల కానున్న ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ టాప్–200లో చోటు దక్కించుకోనున్నాడు. -
డబుల్స్‌లో యూకీ జోడీ పరాజయం
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జోడి సెమీస్‌లో ఓడింది. యూకీ జంట 4–6, 6–7 (2/7)తో హెర్బెర్ట్–సిమోన్ (ఫ్రాన్స్) జోడి చేతిలో కంగుతింది. సింగిల్స్‌లో టాప్ సీడ్ మారిన్ సిలిచ్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. ఈ క్రొయేషియా ఆటగాడికి అన్‌సీడెడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 89వ ర్యాంకర్ సిమోన్ 1–6, 6–3, 6–2తో ఆరో ర్యాంకర్ సిలిచ్‌ను కంగుతినిపించాడు. 2015 సెప్టెంబర్ తర్వాత సిమోన్ ఏటీపీ టోర్నీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో అతను... ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరో సెమీస్‌లో కెవిన్ 6–7 (6/8), 7–6 (7/2), 6–1తో బెనొయిట్ పైర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. -
రన్నరప్ యూకీ
న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో శనివారం ముగిసిన ఈ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ యూకీ 3-6, 1-6తో టాప్ సీడ్ తెమురాజ్ గబాష్విలి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన యూకీకి 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 70 వేలు)తోపాటు 55 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సాకేత్, యూకీ
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 1-6, 6-1తో బ్రిటన్ ఆటగాడు బ్రిడెన్ క్లీన్‌పై నెగ్గాడు. యూకీ బాంబ్రి 6-4, 6-4తో ఆడ్రియన్ (స్పెయిన్)పై గెలిచాడు. -
రెండో రౌండ్లో యూకీ
సమర్ఖండ్ (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ... ఏటీపీ చాలెంజర్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడోసీడ్ యూకీ 6-4, 6-3తో క్వాలిఫయర్ ఇవాన్ గకోవ్ (రష్యా)పై నెగ్గాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు దుర్బెక్ కరిమోవ్ 6-4, 4-6, 6-7 (6)తో దివిజ్ శరణ్‌పై నెగ్గాడు.