హైదరాబాద్‌లో ఫెడరర్, సెరెనా
డిసెంబర్ 9 నుంచి ఐపీటీఎల్
టికెట్ ధర రూ. 15 వేలు
హైదరాబాద్: నగరంలో పెద్ద స్థారుులో టెన్నిస్ పండుగకు రంగం సిద్ధమైంది. రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్‌లాంటి దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం నగర అభిమానులకు దక్కనుంది. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పోటీలను తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 9, 10 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లతో పాటు 11న ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు కె.తారకరామారావుతో కలిసి ఐపీటీఎల్ ప్రమోటర్ మహేశ్ భూపతి టోర్నీ వివరాలు వెల్లడించారు.
ఇందులో నాలుగు జట్లు ఇండియన్ ఏసెస్, జపాన్ వారియర్స్, యూఏఈ రాయల్స్, సింగపూర్ స్లామర్స్ పాల్గొంటున్నారుు. ఈ టోర్నీ గత రెండు సీజన్‌లలో భారత్‌లో మ్యాచ్‌లకు న్యూఢిల్లీ వేదిక కాగా... ఈ సారి హైదరాబాద్‌కు మార్చారు. టోర్నీని విజయవంతగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ‘ఇటీవల మహేశ్‌ను కలిసిన సందర్భంలో ఐపీటీఎల్ గురించి చర్చ జరిగింది. మా దగ్గర నిర్వహించమని నేనే ఆహ్వానించాను. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీని నిర్వహించే అవకాశం రావడం గొప్ప విషయం. మన వద్ద అనేక మంది చిన్నారులు దీని ద్వారా స్ఫూర్తి పొందుతారు. ఈ ఏడాదితో సరిపెట్టకుండా మున్ముందు కూడా నగరంలో మ్యాచ్‌లు కొనసాగాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ అన్నారు.
టీమ్ యజమానులతో చర్చించిన తర్వాత ఐదు నగరాలను పరిశీలించి చివరకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు భూపతి చెప్పారు. ప్రపంచ ఐదో ర్యాంక్ నిషికొరితో పాటు వెర్డాస్కో, బెర్డిచ్, ఇవనోవిచ్, హీతర్ వాట్సన్, కిర్గియోస్, డోడిగ్, సానియా మీర్జా తదితర అగ్రశ్రేణి 30 మంది ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ఐపీటీఎల్ మూడు రోజులు కలిపి టికెట్ ధరను రూ. 15 వేలుగా నిర్ణరుుంచారు. విడిగా ఒక రోజు కోసం టికెట్లను అమ్మడం లేదు. మొత్తం రూ. 15 వేల టికెట్ కొని ఆసక్తి ఉన్న వేర్వేరు వ్యక్తులు దానిని బదిలీ చేసుకొని మ్యాచ్‌లు చూడవచ్చు.