ఆస్ట్రేలియన్ ఓపెన్ ‘డ్రా’ విడుదల
తొలి రౌండ్‌లో సెర్బియా దిగ్గజంతో ఆడనున్న తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్
‘వైల్డ్ కార్డు’తో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలో నిశేష్
మెల్‌బోర్న్: తన కెరీర్‌లో ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లోనే తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి దిగ్గజ ప్లేయర్‌ను ‘ఢీ’కొనబోతున్నాడు. ఈనెల 12 నుంచి మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో 10 సార్లు గెల్చుకున్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్ ప్రత్యర్థిగా నిశేష్ ఎదురునిలువనున్నాడు.
37 ఏళ్ల జొకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాడు. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తే జొకోవిచ్ కెరీర్‌లో 100 సింగిల్స్ టైటిల్స్ మైలురాయిని అందుకోవడంతోపాటు అత్యధికంగా 25 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖిస్తాడు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న 19 ఏళ్ల నిశేష్ ‘వైల్డ్ కార్డు’తో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు.
సీజన్‌లో టాప్–8లో నిలిచిన 20 ఏళ్లలోపు ఆటగాళ్ల కోసం నిర్వహించే నెక్స్‌ట్ జనరేషన్ ఏటీపీ ఫైనల్స్‌లో గత ఏడాది నిశేష్ ఆడి ఆకట్టుకున్నాడు. దాంతో అతనికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో రెండేళ్లపాటు డాటా సైన్స్ విద్యార్థిగా ఉన్న నిశేష్ నెల రోజుల క్రితమే ప్రొఫెషనల్‌గా మారాడు.
బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో ఆడి తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ స్టార్ గేల్ మోన్‌ఫిల్స్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్లేయర్లను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం నిశేష్ ఫామ్ చూస్తుంటే అతను జొకోవిచ్‌కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తోంది.
మరోవైపు జొకోవిచ్‌కు సులువైన ‘డ్రా’ ఎదురుకాలేదు. జొకోవిచ్ పార్శ్వంలోనే స్పెయిన్ స్టార్, ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్, జర్మనీకి చెందిన ప్రపంచ 2వ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఉన్నారు. అంతా సవ్యంగా సాగితే జొకోవిచ్‌కు క్వార్టర్ ఫైనల్లో అల్‌కరాజ్ ఎదురవుతాడు.
అల్‌కరాజ్‌ను దాటితే సెమీఫైనల్లో జ్వెరెవ్‌తో జొకోవిచ్ ఆడే అవకాశముంది. ఈ సెర్బియా స్టార్ తుది పోరుకు చేరితే మరో పార్శ్వంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో టైటిల్ కోసం ఆడాల్సి రావచ్చు.
సబెలాంకాకు క్లిష్టమైన ‘డ్రా’
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాకు కఠినమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, అమెరికా ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్‌తో సబలెంకా ఆడనుంది. గత రెండేళ్లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంటుంది.
స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ (1997, 1998, 1999) తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా సబలెంకా గుర్తింపు పొందుతుంది. సబలెంకాతోపాటు టైటిల్ ఫేవరెట్స్‌గా ఇగా స్వియాటెక్ (పోలాండ్), కోకో గాఫ్ (అమెరికా), కిన్‌వెన్ జెంగ్ (చైనా), రిబాకినా (కజకిస్తాన్) ఉన్నారు.
నగాల్ ప్రత్యర్థి మెఖాచ్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ఆ్రస్టేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ టొమాస్ మెఖాచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆడతాడు. ప్రస్తుతం 96వ ర్యాంక్‌లో ఉన్న నగాల్ తన ర్యాంక్ ఆధారంగా మెయిన్ ‘డ్రా’లో చోటు పొందాడు. గత ఏడాది ఇదే టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించి సంచలనం సృష్టించిన నగాల్ రెండో రౌండ్‌లో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment