
ఫెడరర్‌కు ప్రతికూలమే!
► సెమీస్‌లోనే ఎదురుపడనున్న జొకోవిచ్
► వింబుల్డన్ డ్రా విడుదల
లండన్: ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన స్విట్జర్లాండ్ మేటి ఆటగాడు రోజర్ ఫెడరర్‌కు ‘డ్రా’ ప్రతికూలంగా మారింది. గత రెండు ఫైనల్స్‌లో తనను ఓడించిన డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) ఈసారి సెమీస్‌లోనే ఎదురవుతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్‌ను ఓడించి ఈ స్విస్ స్టార్ టైటిల్ నెగ్గాలంటే అద్భుతం జరగాల్సిందే. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ డ్రాను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. వైల్డ్‌కార్డ్ జెమీ వార్డీ (బ్రిటన్)తో తొలి మ్యాచ్ ఆడనున్న జొకోవిచ్... క్వార్టర్స్‌లో ‘బిగ్ సర్వింగ్ మ్యాన్’ మిలోస్ రావోనిక్ (కెనడా)తో తలపడే అవకాశాలున్నాయి.
ఇక రెండోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్)... సెమీస్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్) తో తలపడనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ సెమీస్‌లో మూడోసీడ్ రద్వాన్‌స్కా (పోలాండ్)తో తలపడే అవకాశాలుండగా; ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ముగురుజా... ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కెర్బర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో పార్శ్వంలోకి వచ్చిన వీనస్ విలియమ్స్‌కు... క్వార్టర్స్‌లో ముగురుజా ఎదురయ్యే అవకాశముండగా, సెరెనాకు రొబెర్టా విన్సీ (ఇటలీ) నుంచి పోటీ తప్పకపోవచ్చు. ఇక రద్వాన్‌స్కా... బెన్సీతో; కెర్బర్... హెలెప్‌తో తలపడొచ్చు.