లండన్: అల్‌కరాజ్ ప్రపంచ నంబర్‌వన్ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో అందరి కళ్లూ జొకోవిచ్‌పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ‘హ్యాట్రిక్’తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్ సంచలనం అల్‌కరాజ్ కూడా టాప్ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్ వేటకు సిద్ధమమయ్యాడు.
మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.
రెండో సీడ్ సెర్బియన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్‌సీడ్ కార్లొస్ అల్‌కరాజ్... జెరెమి చార్డి (ఫ్రాన్స్)తో జరిగే మొదటి రౌండ్ పోరుతో వింబుల్డన్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో రిబాకినా వరుసగా రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్ స్టార్ వింబుల్డన్ ట్రోఫీతో తొలి గ్రాండ్‌స్లామ్ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె రన్నరప్‌గా తృప్తిపడింది. టైటిల్ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్ రోజర్స్‌తో ఆమె తలపడనుంది.
ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)... జు లిన్ (చైనా)తో గ్రాండ్‌స్లామ్ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్ వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment