క్రీడావిభాగం: గత దశాబ్దకాలంలో టెన్నిస్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరు ఫెడరర్ వీరాభిమానులైతే... రెండో వర్గం నాదల్ కోసం ప్రాణమిచ్చేవాళ్లు. ఈ ఇద్దరి మధ్యలో ఐదేళ్ల కాలంగా అనేక విజయాలు సాధిస్తున్నా జొకోవిచ్ మాత్రం అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. ఫెడరర్, నాదల్ ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఫెడరర్ కోర్టులో ఈ చివరి నుంచి ఆ చివరికి సీతాకోక చిలుకలా వెళతాడు. చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. నాదల్ బేస్‌లైన్ దగ్గర గెరిల్లా తరహాలో దూకుడుగా ఆడతాడు. ఒకరు పచ్చిక కోర్టుల్లో పరుగులు పెట్టించే ఆటగాడైతే... మరొకరు మట్టి కోర్టులో మహరాజు. ఈ ఇద్దరి స్థాయిలో అభిమానులు జొకోవిచ్‌ను ఆదరించలేదు. అయితే ఈ ఫ్యాన్స్ అందరూ అభిమానించే రెండో వ్యక్తి జొకోవిచ్.
అటు ఫెడరర్ అభిమానులు, ఇటు నాదల్ అభిమానులు కూడా తమ రెండో ఓటును జొకోవిచ్‌కే వేశారు. నిజానికి ఇది జొకోవిచ్ తప్పుకాదు. అతను గొప్ప హాస్య చతురత ఉన్న వ్యక్తి. కోర్టులో ప్రత్యర్థుల శైలిని అనుకరిస్తూ తాను చేసే విన్యాసాలకు నవ్వుకోని టెన్నిస్ అభిమాని లేడు. అలాగే ప్రత్యర్థిని గౌరవించడంలోనూ అతను ముందుంటాడు. యూఎస్ ఫైనల్ గెలిచాక మాట్లాడుతూ ‘బహుశా టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు ఫెడరర్’ అంటూ కితాబివ్వడం తన స్ఫూర్తికి నిదర్శనం. అయినా మిగిలిన ఇద్దరి స్థాయిలో అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. ఇది జొకోవిచ్ కూడా గమనించాడు. ‘ఫెడరర్‌లాంటి గొప్ప ఆటగాడికి ప్రపంచంలో ఎక్కడ ఆడినా మద్దతు లభిస్తుంది. ఏదో ఒక రోజు ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవాలనేది నా కోరిక’ అని యూఎస్ టైటిల్ గెలిచాక వ్యాఖ్యానించాడు.
ఆట పరంగా జొకోవిచ్ కాస్త ఫెడరర్‌కు దగ్గరగా ఉంటాడు. ఫెడరర్ 7 వింబుల్డన్ టైటిల్స్ సాధిస్తే... నాదల్ 9 ఫ్రెంచ్ టైటిల్స్ కొల్లగొట్టాడు. జొకోవిచ్ సాధించిన 10 గ్రాండ్‌స్లామ్‌లలో 5 ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా వచ్చినవే. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మీద జొకోవిచ్ ముద్ర లేకపోవడం కాస్త ఆశ్చర్యకరమే. అటు ఫెడరర్, నాదల్ ఇద్దరూ అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌నూ సాధిస్తే... జొకోవిచ్‌కు మాత్రం ఫ్రెంచ్ ఇంకా అందలేదు. అతని కెరీర్‌లో ఉన్న లోటు ఇదే. ఆ ఒక్క టైటిల్ కూడా అందితే అతను పరిపూర్ణ ఆటగాడవుతాడు.
ఒత్తిడిలోనూ సులభంగా...
ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్‌కు ఫెడరర్ నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా గట్టిపోటీ ఎదురయింది. ఒక దశలో ఫెడరర్ సాధించిన ప్రతి పాయింట్‌కూ స్టేడియం హోరెత్తింది. మొత్తం న్యూయార్క్ నగరంతో జొకోవిచ్ పోరాడాడా? అనిపించింది. అంత ఒత్తిడిని కూడా అతను జయించాడు. గత మూడేళ్లుగా ఫెడరర్ టైటిల్స్, జోరు తగ్గాయి. కానీ ఈ ఏడాది వింబుల్డన్ నుంచి అతను అద్భుతంగా ఆడుతున్నాడు. తన కెరీర్‌లో పీక్ దశలో ఆడిన టెన్నిస్‌ను మళ్లీ అభిమానులకు ఫెడరర్ రుచి చూపిస్తున్నాడు. అయితే జొకోవిచ్ దీనికి సన్నద్ధమై వచ్చాడు. ఫెడరర్ తీసుకొచ్చిన కొత్త టెక్నిక్‌ను, వైవిధ్యాన్ని జొకో పసిగట్టి సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈసారి కూడా జొకోవిచ్ గెలుస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉన్నా... టోర్నీలో ఫెడరర్ చూపించిన అసమాన ఆటతీరు పోరులో ఉత్కంఠను పెంచింది. అయినా చివరకు జొకో జోరును ఫెడెక్స్ ఆపలేకపోయాడు.
దిగ్గజాల సరసన
కెరీర్‌లో పది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం చాలా గొప్ప ఘనత. అతనికంటే ముందు ఈ మార్కును కేవలం ఏడుగురు మాత్రమే చేరుకున్నారు. జొకోవిచ్ ఇదే జోరును కొనసాగిస్తే ఫెడరర్ (17) టైటిల్స్ రికార్డును చేరడం కూడా కష్టమేమీ కాదు. ఇప్పటికే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ జాబితాలో జొకోవిచ్ చేరిపోయాడు. ఫెడరర్, నాదల్ ఒకరకంగా కెరీర్‌లో పీక్ స్టేజ్‌ను దాటి వచ్చేశారనే అనుకోవాలి. ఇక ముర్రే, వావ్రింకా అడపాదడపా మెరుస్తారే తప్ప జొకో స్థాయి లేదు. ప్రస్తుతం ఉన్న ఫామ్, తన ప్రణాళిక చూస్తే రాబోయే మూడు నాలుగేళ్లు జొకోవిచ్ హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2011తో పోలిస్తే ఇప్పుడు జొకోవిచ్‌లో పరిణతి బాగా పెరిగింది. భర్తగా, తండ్రిగా తన బాధ్యత పెరగడం వల్ల టెన్నిస్‌ను చూసే దృక్పథంలోనూ తేడా వచ్చిందని అంటున్నాడు. శారీరకంగా, మానసికంగా కూడా జొకోవిచ్ దృఢంగా తయారయ్యాడు. శరీరం, మనసు రెండింటి మీదా నియంత్రణతో ఉన్న ఆటగాడు కచ్చితంగా ఎప్పుడూ చాంపియన్‌గానే ఉంటాడు. జొకోవిచ్ ఇదే కోవలోకి వస్తాడు.
‘అందరివాడు’ కాకున్నా...
Published Mon, Sep 14 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement