సంపాదనలో కూడా ఆ ఇద్దరే!
పారిస్: ఆ ఇద్దరూ టెన్నిస్ రారాజులు. ఒకరు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కాగా మరొకరు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్. వీరిలో జొకోవిచ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, ఫెదరర్ మూడో స్థానంలో ఉన్నాడు. టైటిల్స్ విషయంలో కూడా వీరిద్దరూ తమదైన ముద్రను వేశారు. ఫెదరర్ ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్స్ ఉండగా.. జొకోవిచ్ ఇప్పటివరకూ 10 గ్రాండ్ స్లామ్స్ ను సాధించాడు. ఇదిలా ఉంచితే .. ఆట ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం వీరిద్దరూ ఏ క్రీడాకారుడికి అందనంత ఎత్తులో ఉన్నారు.
చివరిసారిగా 2012 లో వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ ను గెలిచిన ఫెదరర్ ఆదాయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఫెదరర్ 97 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 641 కోట్లు) ఆదాయంతో ముందు వరుసలో ఉండగా, జొకోవిచ్ 94 మిలియన్ డాలర్లు (సుమారు రూ.621కోట్లు) సంపాదనతో తరువాతి స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ దిగ్గజ ఆటగాళ్లు వంద మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరేందుకు అతి కొద్ది దూరంలో నిలిచారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ లో ఫెదరర్ టైటిల్ ను కైవసం చేసుకుంటే మాత్రం 100 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది.
మరోపక్క అద్భుతమైన ఫామ్ లో ఉన్న జొకోవిచ్ .. ఆస్ట్రేలియా ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది జొకోవిచ్ మూడు గ్రాండ్ స్లామ్స్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 21.5 మిలియన్ డాలర్లు(సుమారు రూ.133 కోట్లు)ను టెన్నిస్ బ్యాట్ ద్వారా రాబట్టడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఎండోర్స్ మెంట్ ద్వారా అత్యధిక మొత్తాన్ని సంపాదించిన ఐదో ఆటగాడిగా ఫెదరర్ గుర్తింపు సాధించాడు. ఈ ఏడాది ఫెదరర్ కు ఎండోర్స్ మెంట్ ద్వారా 58 మిలియన్ డాలర్లు(సుమారు 383 కోట్లు) ఆదాయం లభించింది. వీరిద్దరూ ఆటలోనే కాదు.. ఆదాయంలో కూడా ఒకరితో ఒకరు పోటీ పడటం నిజంగా ఆసక్తికరమే కదా!