
మళ్లీ ఆ ఇద్దరే...
♦ ఫైనల్లో జొకోవిచ్‌తో ఫెడరర్ ‘ఢీ’
♦ సెమీస్‌లో అలవోక విజయాలు
♦ యూఎస్ ఓపెన్ టోర్నీ
అంచనాలు నిజమయ్యాయి. ఊహించిన ఆటగాళ్లే అంతిమ సమరానికి అర్హత సాధించారు. ఆద్యంతం అద్వితీయ ఆటతీరును కనబరుస్తూ... యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్, రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్ అమీతుమీ తేల్చుకోనున్నారు. గత జులైలో వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫెడరర్... ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేసుకోవాలనే లక్ష్యంతో జొకోవిచ్ ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 1.30కు పురుషుల సింగిల్స్ ఫైనల్ మొదలవుతుంది.
న్యూయార్క్ : ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో కొత్త వ్యూహాలతో అందర్నీ హడలెత్తిస్తున్న ఫెడరర్ సెమీఫైనల్లోనూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వరుస సెట్‌లలో తన మిత్రుడు, స్విట్జర్లాండ్‌కే చెందిన స్టానిస్లాస్ వావ్రింకా ఆట కట్టించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ కేవలం 92 నిమిషాల్లో 6-4, 6-3, 6-1తో ఐదో సీడ్ వావ్రింకాను ఓడించాడు.
ఈ గెలుపుతో ఫెడరర్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్‌లో ఏడోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. వరుసగా ఐదుసార్లు (2004 నుంచి 2008 వరకు) యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఫెడరర్, 2009లో మాత్రం రన్నరప్‌గా నిలిచాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 21-20తో జొకోవిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల విషయానికొస్తే మాత్రం జొకోవిచ్ 7-6తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
ఒక్క సెట్ కోల్పోకుండా...
సెమీఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని ఫెడరర్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. తన సహచరుడు వావ్రింకా ఆటతీరుపై పూర్తి అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ఆడిన ఫెడరర్ తొలి సెట్ ఆరంభంలోనే వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని 36 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లోనూ ఫెడరర్ జోరు కొనసాగించాడు. రెండుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ దిగ్గజం 31 నిమిషాల్లో రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. మూడో సెట్‌లోనూ ఫెడరర్ దూకుడుకు వావ్రింకా సమాధానం ఇవ్వలేకపోయాడు. ఈ సెట్‌లోనూ రెండుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ 25 నిమిషాల్లోనే మూడో సెట్‌ను నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
మ్యాచ్ మొత్తంలో 10 ఏస్‌లు సంధించిన ఫెడరర్ కేవలం రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. వావ్రింకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన అతను 28 సార్లు నెట్ వద్దకు వచ్చి 22 సార్లు పాయింట్లు సంపాదించాడు. 29 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 17 అనవసర తప్పిదాలు చేశాడు.
జబర్దస్త్... జొకోవిచ్
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తన విశ్వరూపాన్ని చూపించాడు. డిఫెండిగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ కేవలం 85 నిమిషాల్లో 6-0, 6-1, 6-2తో గెలుపొందాడు. సిలిచ్‌పై విజయంతో ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరుకున్న ఘనత ను జొకోవిచ్ సాధించాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్ చేరిన మూడో క్రీడాకారుడిగా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. గతంలో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా-1969లో) ఒకసారి... రోజర్ ఫెడరర్ (2006, 2007, 2009) మూడుసార్లు ఈ ఘనత సాధించారు. 2001 తర్వాత యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ఒక ఆటగాడు కేవలం మూడు గేమ్‌లు కోల్పోయి, ఇంత ఏకపక్షంగా నెగ్గడం ఇదే ప్రథమం.
చీలమండ గాయంతో బాధపడుతున్న సిలిచ్ సెమీఫైనల్‌ను తొందరగా ముగించాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే సిలిచ్ గాయంపై అవగాహన ఉన్న జొకోవిచ్ వ్యూహం ప్రకారం ఆడాడు. సిలిచ్‌ను సాధ్యమైనంత శ్రమించేలా చేసిన జొకోవిచ్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. కెరీర్‌లో ఆరోసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న జొకోవిచ్ నాలుగుసార్లు (2007, 2010, 2012, 2013) రన్నరప్‌గా నిలిచి, మరోసారి విజేతగా (2011లో) నిలిచాడు. .