న్యూయార్క్: గత మూడేళ్లుగా ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో సెరెనాకు ఈ రికార్డును సమం చేసేందుకు సువర్ణావకాశం దక్కింది. కరోనా వైరస్ భయం కారణంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమంటూ మహిళల సింగిల్స్‌లో టాప్–10 ర్యాంకింగ్స్‌లోని ఆరుగురు క్రీడాకారిణులు యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగారు. పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు లేకపోవడంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న సెరెనా తన అనుభవాన్నంతా రంగరిస్తే 24వ గ్రాండ్ స్లామ్‌ను అందుకోవడం కష్టమేమీ కాదు. ‘డ్రా’ ప్రకారం సెరెనాకు క్వార్టర్ ఫైనల్ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేరు.
ఫేవరెట్ జొకోవిచ్...
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, మూడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకోలేనంటూ డిఫెండింగ్ చాంపియన్, రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)... గాయం కారణంగా మాజీ చాంపియన్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ యూఎస్ ఓపెన్‌లో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో జొకోవిచ్ కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టాడు. జొకోవిచ్ టైటిల్ దారిలో రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) అడ్డుతగిలే అవకాశం ఉంది. భారత్ నుంచి యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్‌లో సుమీత్ నాగల్... పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ బరిలో ఉన్నారు. ఈసారి మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు. సోమవారం టోర్నీ ప్రారంభమవుతుండగా ఆదివారం ఎంట్రీలు ఖరారు చేసిన జాబితాలో ఉన్న ఓ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. ఆ ఆటగాడు ఫ్రాన్స్‌కు చెందిన 17వ సీడ్ బెనోయిట్ పైర్ అని నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment