లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడుసార్లు చాంపియన్ అయిన జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో బుధవారం జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) తుంటి గాయంతో వైదొలిగాడు.
దాంతో జొకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు ఇటలీ రైజింగ్ స్టార్ లొరెంజో ముసెట్టి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముసెట్టి 3–6, 7–6 (7/5), 6–2, 3–6, 6–1తో గెలిచి సెమీస్‌లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), 31వ సీడ్ బార్బరా క్రిచికో వా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రిబాకినా 6–3, 6–2తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, క్రిచికోవా 6–4, 7–6 (7/4)తో ఒస్టాపెంకో (లాతి్వయా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment