వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం
ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్‌పై అలవోక విజయం
రూ. 29 కోట్ల 23 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్న స్పెయిన్ స్టార్
లండన్: పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ అల్‌కరాజ్ శకం మొదలైంది! 21 ఏళ్ల ఈ స్పెయిన్ స్టార్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్‌కరాజ్ 2 గంటల 27 నిమిషాల్లో 6–2, 6–2, 7–6 (7/4)తో రెండో సీడ్ , 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత జొకోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు.
విజేత అల్‌కరాజ్‌కు 27 లక్షల పౌండ్ల (రూ. 29 కోట్ల 23 లక్షలు) ప్రైజ్‌మనీ... రన్నరప్ జొకోవిచ్‌కు 14 లక్షల పౌండ్ల (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. అల్‌కరాజ్ కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అతను 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్, 2024లో ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నీలను సాధించాడు.
బ్రేక్ పాయింట్‌తో మొదలు...
గత ఏడాది ఐదు సెట్‌ల పోరులో జొకోవిచ్‌ను ఓడించిన అల్‌కరాజ్ ఈసారి తొలి పాయింట్ నుంచే ఆధిపత్యం కనబరిచాడు. తొలి సెట్‌లో 14 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లోనే జొకోవిచ్ సర్వీస్‌ను అల్‌కరాజ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన అల్‌కరాజ్ అదే జోరులో 41 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో సెట్‌లో తొలి గేమ్‌లో, ఏడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ 34 నిమిషాల్లో సెట్ నెగ్గాడు. మూడో సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్‌కరాజ్ పదో గేమ్‌లోని తన సర్వీస్‌లో 40–0తో మూడు మ్యాచ్ పాయింట్లను సాధించాడు.
అయితే ఈ మూడు మ్యాచ్ పాయింట్లను జొకోవిచ్ కాపాడుకొని గట్టెక్కాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో అల్‌కరాజ్ పైచేయి సాధించి జొకోవిచ్ ఆట కట్టించాడు.
6 ఓపెన్ శకంలో ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్ సాధించిన ఆరో ప్లేయర్ అల్‌కరాజ్. గతంలో రాడ్ లేవర్ (ఆ్రస్టేలియా; 1969లో), జాన్ బోర్గ్ (స్వీడన్; 1978, 1979, 1980లలో), రాఫెల్ నాదల్ (స్పెయిన్; 2008, 2010లలో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), జొకోవిచ్ (సెర్బియా; 2021లో) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment