వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అల్‌కరాజ్‌తో అమీతుమీ
లండన్: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో నిలిచాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో సీడ్ జొకోవిచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 48 నిమిషాల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. గత ఏడాది కూడా వీరిద్దరి మధ్యే ఫైనల్ జరగ్గా... అల్‌కరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ టోర్నీలో జొకోవిచ్ 2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచి... 2013, 2023లలో రన్నరప్‌గా నిలిచాడు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో అల్‌కరాజ్ 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు.
2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన అల్‌కరాజ్... మెద్వెదెవ్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన ఈ స్పెయిన్ స్టార్ 38 సార్లు పాయింట్లు గెలిచాడు. అల్‌కరాజ్, మెద్వెదెవ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యక్షంగా తిలకించాడు.
Comments
Please login to add a commentAdd a comment