
అడిలైడ్: 14 రోజుల క్వారంటైన్... మరో చోట అయితే మామూలుగా గడిచిపోయేదేమో! కానీ కఠిన ఆంక్షలు ఉన్న ఆస్ట్రేలియాలో అదంత సులువు కాదు. ఇక ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఆటగాళ్ల పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చి క్వారంటైన్‌లో ఉన్న టెన్నిస్ స్టార్లు తమ రెండు వారాల క్వారంటైన్ ముగియడంతో ఒక్కసారిగా స్వేచ్ఛాజీవులుగా మారిపోయారు. మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తన మూడేళ్లు కూతురు ఒలింపియాతో కలిసి ‘జూ’కు వెళ్లి సరదాగా గడిపింది. ‘ఒక్క గదిలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా కష్టం. అయితే పాపతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది.
ఇప్పుడు బయటకు రావడం సంతోషంగా ఉంది. అందుకే క్వారంటైన్ ముగియగానే జూకు వెళ్లొచ్చాం’ అని సెరెనా చెప్పింది. వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ క్వారంటైన్ ముగియగానే స్థానిక పార్క్‌లో చెప్పులు లేకుండా నడిచి తన ఆనందాన్ని ప్రదర్శించాడు. ‘ఇన్ని రోజులుగా నాకు అవకాశం రాని పని చేయాలననుకున్నా. ఇప్పుడు ఇలా పచ్చగడ్డిపై పాదాలు పెట్టగానే హాయిగా అనిపించింది’ అని జొకోవిచ్ అన్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో నయోమి ఒసాకాపై సెరెనా విలియమ్స్, యాష్లే బార్టీపై సిమోనా హలెప్, డొమినిక్ థీమ్‌పై రాఫెల్ నాదల్ విజయం సాధించారు. జన్నిక్ సిన్నర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌లో ఫిలిప్ క్రనోవిక్ తలపడగా... రెండో సెట్‌లో క్రనోవిక్ స్థానంలో జొకోవిచ్ వచ్చి ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో క్రనోవిక్–జొకోవిచ్ గెలిచారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 8న మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment