జొకోవిచ్, నాదల్ శుభారంభం
తొమ్మిదో సీడ్ నిషికోరికి షాక్ ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ సాధించాలనే లక్ష్యంతో ఉన్న నొవాక్ జొకోవిచ్... తొమ్మిదోసారి టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను అలవోకగా ఓడించారు. రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2, 6-4తో సౌసా (పోర్చుగల్)పై నెగ్గాడు.
గంటా 50 నిమిషాల ఈ పోరులో జొకోవిచ్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్) 6-0, 6-3, 6-0తో రాబీ జినెప్రి (అమెరికా)ను చిత్తుగా ఓడించాడు. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేయడంతోపాటు... నెట్‌వద్ద 10 పాయింట్లు సాధించాడు.
మరోవైపు ఆసియా ఆశాకిరణం, తొమ్మిదో సీడ్ కీ నిషికోరి (జపాన్) తొలి రౌండ్‌లోనే అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు. అన్‌సీడెడ్ మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా) 7-6 (7/4), 6-1, 6-2తో నిషికోరిపై సంచలనం సృష్టించాడు. 30వ సీడ్ పోస్పిసిల్ (కెనడా) కూడా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. గబాష్‌విలి (రష్యా) 6-4, 6-2, 6-3తో పోస్పిసిల్‌ను ఓడించాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ టామీ రొబ్రెడో (స్పెయిన్) 4-6, 6-4, 6-2, 6-4తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై; 26వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) 6-3, 7-6 (10/8), 6-3తో దామిర్ జుమ్‌హుర్ (బోస్నియా అండ్ హెర్జిగోవినా)పై; 29వ సీడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-1, 6-1, 6-3తో పావిక్ (క్రొయేషియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
షరపోవా దూకుడు
మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్, నిరుటి రన్నరప్ మరియా షరపోవా (రష్యా) రెండో రౌండ్‌లోకి చేరుకుంది. తొలి రౌండ్‌లో షరపోవా 6-1, 6-2తో పెర్వాక్ (రష్యా)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7-5, 6-0తో రజానో (ఫ్రాన్స్)పై; 12వ సీడ్ పెనెట్టా (ఇటలీ) 6-2, 6-2తో యాచ్లిట్నర్ (ఆస్ట్రియా)పై; 16వ సీడ్ లిసికి (జర్మనీ) 6-1, 7-5తో ఫెర్రో (ఫ్రాన్స్)పై నెగ్గారు. అయితే 17వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-3, 3-6, 2-6తో పౌలీన్ పర్మాంటీర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది.
సానియా జోడికి ఐదో సీడ్
మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా
(భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే)కి ఐదో సీడింగ్ లభించింది. తొలి రౌండ్‌లో ఈ జంట డానియెలా హంతుచోవా (స్లొవేకియా)-షహర్ పీర్ (ఇజ్రాయెల్) ద్వయంతో ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జంట కార్లోవిచ్-స్టీవెన్ రాబర్ట్ జోడితో ఆడుతుంది.