చెమటోడ్చిన సెరెనా | Serena hard work | Sakshi
Sakshi News home page

చెమటోడ్చిన సెరెనా

Published Fri, Sep 4 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

చెమటోడ్చిన సెరెనా

చెమటోడ్చిన సెరెనా

♦ యూఎస్ ఓపెన్ మూడోరౌండ్‌లోకి ప్రవేశం 
♦ నాదల్, జొకోవిచ్ కూడా...
 
 న్యూయార్క్ : ‘క్యాలెండర్ స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్‌లో చెమటోడ్చి నెగ్గింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-3తో ప్రపంచ 110వ ర్యాంకర్  క్వాలిఫయర్ కికి బెర్టెన్స్ (డచ్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టింది. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 34 అనవసర తప్పిదాలు, 10సార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బెర్టెన్స్ ధాటికి అమెరికా ప్లేయర్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించింది.

తొలిసెట్‌లో 5-5తో స్కోరును సమం చేసిన సెరెనా 11వ గేమ్‌లో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసినా సర్వీస్ నిలబెట్టుకుంది. బెర్టెన్స్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లోనూ బెర్టెన్స్ దూకుడుకు సెరెనా 0-4తో వెనుకబడింది. అయితే తన అనుభవంతో... డచ్ ప్లేయర్ చేసిన అనవసర తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకుని సెట్‌ను దక్కించుకుంది. రెండోసెట్‌లో కాస్త ఇబ్బందిపడినా.. కీలక సమయంలో అద్భుతమైన షాట్లతో చెలరేగింది. రెండు, ఆరు, తొమ్మిదో గేమ్‌ల్లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన టాప్‌సీడ్... మూడు, ఐదు, ఎనిమిదో గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.ఇతర మ్యాచ్‌ల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-7 (2), 6-2తో ఇన్నా ఫాల్కోని (అమెరికా)పై; రద్వాన్‌స్కా (పోలెండ్) 6-3, 6-2తో లిన్నెటి (పోలెండ్)పై; మకరోవా (రష్యా) 6-1, 6-2తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు.

 నాదల్ అలవోకగా...
 పురుషుల రెండోరౌండ్‌లో 8వ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 7-6 (7/5), 6-3, 7-5తో డిగో స్వార్జ్‌మెన్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలిసెట్ టైబ్రేక్‌లో 4-5తో వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుని మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-1, 6-2తో ఆండ్రియా హైదర్ మౌరెర్ (ఆస్ట్రియా)పై; సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-3, 7-5తో డాన్‌స్కో (రొమేనియా)పై; రావోనిక్ (కెనడా) 6-2, 6-4, 6-7 (7/5), 7-6 (1)తో వెర్డాస్కో (స్పెయిన్)పై; 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో గ్రానోలర్స్ (స్పెయిన్)పై; గోఫిన్ (బెల్జియం) 5-7, 6-4, 3-6, 6-2, 6-1తో బెర్నాకిస్ (లిథువేనియా)పై; లోపెజ్ (స్పెయిన్) 2-6, 6-3, 1-6, 7-5, 6-3తో మార్డి ఫిష్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

 రెండోరౌండ్‌లో పేస్, బోపన్న
 వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండోరౌండ్‌లోకి ప్రవేశించింది. తొలిరౌండ్‌లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-2, 6-2తో టేలర్ హారీ ఫ్రిట్జ్-సీ లూయి (అమెరికా)లపై నెగ్గారు. భారత్-స్విస్ ద్వయం 46 నిమిషాల్లో ప్రత్యర్థుల ఆట కట్టించింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో ఆరోసీడ్ రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జీ (రొమేనియా) 6-3, 6-4తో ఆస్టిన్ క్రాజిసెక్-నికోలస్ మున్రో (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట సత్తా మేరకు రాణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement