కుర్రాళ్లపైనే భారం!
నేటి నుంచి కొరియాతో డేవిస్ కప్ పోరు
డబుల్స్‌లో బోపన్న జతగా పేస్
చండీగఢ్: కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం... బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం, సమన్వయ లోపం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భారత్... కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సమస్యలున్నా ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్‌లు గైర్హాజరీతో.. 21 ఏళ్ల రామ్‌కుమార్‌కు డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. చెన్నైకి చెందిన ఇతనికి అనుభవం లేకపోయినా నైపుణ్యానికి మాత్రం కొదువలేదు. ఇక సాకేత్ మైనేని అనుభవం ఉన్నా... భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలా అత్యవసరం. ఓవరాల్‌గా సీనియర్లు లేకపోవడంతో ఇప్పుడు ఈ కుర్రాళ్లపై భారత్ నమ్మకం పెట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్టుకు అనుభవం లేకపోవడం, సొంతగడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఈ ఇద్దరికి కలిసొచ్చే అంశం. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హరియాణా, పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ డేవిస్ కప్‌కు సంబంధించిన డ్రాను విడుదల చేశారు. దీని ప్రకారం కొరియా నుంచి భారత్‌కు పెద్దగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు. 2008 తర్వాత భారత్‌లో గ్రాస్‌కోర్టుపై డేవిస్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో న్యూఢిల్లీలో జరిగిన పోరులో భారత్ 3-2తో జపాన్‌ను ఓడించింది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ (217)... సియోంగ్ చెన్ హాంగ్ (427)తో; రెండో సింగిల్స్‌లో సాకేత్... యంగ్ యూ లిమ్‌తో తలపడతారు.
జత కుదిరేనా..!
సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్-రోహన్ బోపన్నలు మరోసారి డేవిస్ కప్‌లో జతగా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది. గతంలో పేస్-బోపన్న... చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా... సెర్బియాతో పోరులో మాత్రం అద్భుతంగా ఆడారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఆడాలని అందరూ కోరుకుంటున్నా... ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రియో ఒలింపిక్స్ కోసం బోపన్న.. సాకేత్ పేరును సూచించగా ఏఐటీఏ జోక్యం చేసుకుని పేస్‌ను జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కొరియాపై భారత్ గెలవాలంటే పేస్-బోపన్న డబుల్స్‌లో సత్తా చాటాలి. శనివారం జరిగే డబుల్స్‌లో పేస్-బోపన్న జంటతో... హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్‌లు తలపడతారు. బుధవారమే చండీగఢ్‌కు చేరుకున్న పేస్.. గంటన్నర పాటు ప్రాక్టీస్ చేశాడు. గతాన్ని మర్చిపోయి కలిసి ఆడతామని పేస్, బోపన్న చెబుతున్నా.. మైదానంలో ఏమేరకు సమన్వయం కుదురుతుందో చూడాలి.