భారత్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ అర్హత పోటీలో భాగంగా చెక్ రిపబ్లిక్ తో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6 తేడాతో జరీ వెస్లీపై ఓటమి పాలై భారత ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ గెలుపుతో 3-1 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన చెక్ రిపబ్లిక్ .. డేవిస్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన సింగిల్స్ లో ఇరు జట్లు చెరో పాయింట్ తో సమానంగా నిలిచినా, డబుల్స్ లో లియాండర్ పేస్- రోహన్ బోపన్నా జోడీలు ఓటమి చెంది చెక్ రిపబ్లిక్ కుఆధిక్యం కట్టబట్టారు. దీంతో ఈరోజు జరిగే రివర్స్ సింగిల్స్ పోరు కీలకంగా మారింది.
దీనిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-లూకా రసూల్ ల మధ్య జరగాల్సిన మరో మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వెస్లీతో రెండు గంటల 14 నిమిషాల పాటు జరిపిన పోరులో బాంబ్రీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్ ను కోల్పోయి ఆదిలోనే వెనుకబడ్డ బాంబ్రీ ఆ తరువాత ప్రతిఘటించినా కుదరలేదు. యూకీ బాంబ్రీ సర్వీసుల్లో అనవసర తప్పిదాలు చేసి ఓటమిని కొనితెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆద్యంత నియంత్రణలో ఆటన కొనసాగించిన వెస్లీ సరైన సమయంలో ఎదురుదాడికి దిగుతూ బాంబ్రీని ఒత్తిడిలోకి నెట్టాడు.
స్వదేశంలో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ లో విఫలం చెందిన భారత్..వచ్చే సంవత్సరం జరుగనున్న ఆసియా-ఒసియానా గ్రూప్-1 పోరుకే భారత్ పరిమితమైంది. 2011లో సెర్బియా తో జరిగిన తొలి రౌండ్ లో 4-1 తేడాతో ఓటమి పాలైన అనంతరం డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించడానికి భారత్ చేసిన తొలిసారి ప్రయత్నంలో విఫలం చెందింది.