World Group
-
Davis Cup: వరల్డ్ గ్రూప్–2కు పడిపోయిన భారత్
హిలెరాడ్ (డెన్మార్క్): ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ డేవిస్ కప్‌లో 2019లో కొత్త ఫార్మాట్ మొదలుపెట్టాక... భారత జట్టు తొలిసారి వరల్డ్ గ్రూప్–2కు పడిపోయింది. డెన్మార్క్ జట్టుతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2–3 తేడాతో ఓడిపోయింది. తొలి రోజు రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 4–6, 6–3, 6–4తో ఆగస్ట్ హోమ్‌గ్రెన్‌ను ఓడించడంతో భారత్ స్కోరున 1–1తో సమం చేసింది. అయితే రెండో రోజు డబుల్స్ మ్యాచ్‌లో హోల్గర్ రూన్–ఇంగిల్డ్‌సెన్ జోడీ 6–2, 6–4తో 65 నిమిషాల్లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ ద్వయంపై గెలిచి డెన్మార్క్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో హోల్గర్ రూన్ 7–5, 6–3తో సుమిత్ నగాల్‌పై నెగ్గడంతో డెన్మార్క్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో... నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–4, 7–6 (7/1)తో ఎల్మెర్ మోలెర్‌ను ఓడించాడు. -
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
డేవిస్ కప్‌లో నార్వేతో భారత్ పోరు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1లో భారత్ తలపడే ప్రత్యర్థి ఖరారైంది. ఈ పోరులో నార్వేతో భారత ఢీకొంటుంది. గురువారం ఈ ‘డ్రా’ విడుదల చేయగా, నార్వే వేదికగానే భారత్ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. సెప్టెంబర్ 16–18 మధ్య డేవిస్ కప్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దాదాపు అదే తేదీల్లో ఆసియా క్రీడలు కూడా జరగనుండటంతో జట్టు ఎంపిక భారత టెన్నిస్ సంఘానికి (ఏఐటీఏ) ఇబ్బందిగా మారనుంది. ఆసియా క్రీడల్లో సెప్టెంబర్ 10–14 మధ్య టెన్నిస్ మ్యాచ్ జరగనుండగా...తక్కువ వ్యవధిలో నార్వే చేరుకొని భారత్ ఆడటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో తేదీల్లో మార్పు చేసే విషయంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)కు ఏఐటీఏ విజ్ఞప్తి చేయనుంది. డేవిస్ కప్ చరిత్రలో భారత్, నార్వే ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడలేదు. ఆ జట్టులో వరల్డ్ నంబర్ 8 కాస్పర్ రూడ్ రూపంలో అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. -
Davis Cup: పరాజయాలతో మొదలుపెట్టిన భారత ప్లేయర్లు
ఎస్పూ (ఫిన్లాండ్): డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను భారత్ ఓటములతో ఆరంభించింది. వరల్డ్ గ్రూప్–1లో భాగంగా ఫిన్లాండ్తో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు నిరాశే ఎదురైంది. ప్రపంచ 165వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3–6, 6–7 (1/7)తో 419వ ర్యాంకర్ ఒట్టో విర్టనెన్ చేతిలో ఓడాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ 4–6, 5–7తో ఎమిల్ రుసువురి చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో తొలి రోజు ముగిసే సరికి ఫిన్లాండ్ 2–0తో భారత్‌పై ఆధిక్యంలో నిలిచింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఈ ‘టై’లో ఫిన్లాండ్ విజేతగా నిలుస్తుంది. భారత్ గెలవాలంటే మాత్రం వరుసగా మూడు మ్యాచుల్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. డబుల్స్‌లో హ్యారి హెలివోరా–హెన్రీ కొంటినెన్ ద్వయంతో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట ఆడనుంది. అనంతరం జరిగే రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో... ఎమిల్ రుసువురితో ప్రజ్నేశ్; ఒట్టో విర్టనెన్తో రామ్‌కుమార్ తలపడతారు. వరుస సెట్లలో... గంటా 25 నిమిషాల పాటు విర్టనెన్తో జరిగిన పోరులో ప్రజ్నేశ్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ ఆరో గేమ్‌లో ప్రజ్నేశ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన విర్టనెన్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఫిన్లాండ్ ప్లేయర్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ప్రజ్నేశ్ చేజార్చుకున్నాడు. రెండో సెట్లో మాత్రం ప్రజ్నేశ్ మెరుగ్గా ఆడాడు. పదునైన సరీ్వస్‌లతో ఏస్‌లను సాధిస్తూ తన సర్వీస్‌ను కోల్పోకుండా చూసుకున్నాడు. అయితే ప్రత్యర్థి సరీ్వస్‌ను ఒకసారి బ్రేక్ చేసేందుకు అవకాశం వచి్చనా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సెట్లో ఇద్దరు కూడా తమ సరీ్వస్‌లను నిలుపుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 20 ఏళ్ల విర్టనెన్ 7–1తో టై బ్రేక్‌ను సొంతం చేసుకొని విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతడు 10 ఏస్‌లను సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లను చేయగా... ప్రజ్నేశ్ 6 ఏస్‌లను సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లను చేశాడు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లోనూ రామ్‌కుమార్ వరుస సెట్లలోనే ఓడాడు. -
వరల్డ్ గ్రూప్‌కు భారత జూనియర్లు
న్యూఢిల్లీ: భారత జూనియర్ ఫెడ్ కప్ జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆసియా/ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జూనియర్ టెన్నిస్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో నెగ్గింది. సింగిల్స్‌లో మహక్ జైన్, సామ సాత్విక విజయాలు సాధించారు. డబుల్స్‌లో శివాని, సాత్విక జోడి ఓడింది. ఈ టోర్నీలో జపాన్ చేతిలో ఓడిన భారత్.. లంక, ఉజ్బెకిస్తాన్, కొరియా, ఆసీస్‌పై విజయాలు అందుకుంది. -
భారత్ కు చుక్కెదురు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ అర్హత పోటీలో భాగంగా చెక్ రిపబ్లిక్ తో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో యూకీ బాంబ్రీ 3-6, 5-7, 2-6 తేడాతో జరీ వెస్లీపై ఓటమి పాలై భారత ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ గెలుపుతో 3-1 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన చెక్ రిపబ్లిక్ .. డేవిస్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన సింగిల్స్ లో ఇరు జట్లు చెరో పాయింట్ తో సమానంగా నిలిచినా, డబుల్స్ లో లియాండర్ పేస్- రోహన్ బోపన్నా జోడీలు ఓటమి చెంది చెక్ రిపబ్లిక్ కుఆధిక్యం కట్టబట్టారు. దీంతో ఈరోజు జరిగే రివర్స్ సింగిల్స్ పోరు కీలకంగా మారింది. దీనిలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో యూకీ బాంబ్రీ ఓటమి చెందడంతో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-లూకా రసూల్ ల మధ్య జరగాల్సిన మరో మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వెస్లీతో రెండు గంటల 14 నిమిషాల పాటు జరిపిన పోరులో బాంబ్రీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్ ను కోల్పోయి ఆదిలోనే వెనుకబడ్డ బాంబ్రీ ఆ తరువాత ప్రతిఘటించినా కుదరలేదు. యూకీ బాంబ్రీ సర్వీసుల్లో అనవసర తప్పిదాలు చేసి ఓటమిని కొనితెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆద్యంత నియంత్రణలో ఆటన కొనసాగించిన వెస్లీ సరైన సమయంలో ఎదురుదాడికి దిగుతూ బాంబ్రీని ఒత్తిడిలోకి నెట్టాడు. స్వదేశంలో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ లో విఫలం చెందిన భారత్..వచ్చే సంవత్సరం జరుగనున్న ఆసియా-ఒసియానా గ్రూప్-1 పోరుకే భారత్ పరిమితమైంది. 2011లో సెర్బియా తో జరిగిన తొలి రౌండ్ లో 4-1 తేడాతో ఓటమి పాలైన అనంతరం డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ కు అర్హత సాధించడానికి భారత్ చేసిన తొలిసారి ప్రయత్నంలో విఫలం చెందింది. -
ఆశలు సజీవం
బెంగళూరు: ఓవైపు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్... అప్పటికే వరుసగా రెండు సెట్లలో ఓటమి... మరో సెట్ కోల్పోతే అంతే.. కానీ దేశం కోసం బరిలోకి దిగిన ప్రతీసారి పోరాట యోధుడిలా చెలరేగే దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ ఈ సమయంలో అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. సహచరుడు రోహన్ బోపన్నతో చక్కటి సమన్వయం ఏర్పరుచుకుని ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో భారత ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు నెగ్గితేనే వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధిస్తారు. సెర్బియాతో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయాలే ఎదురుకాగా... శనివారంనాటి డబుల్స్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ దశలో స్వదేశంలో తొలిసారిగా కలిసి ఆడిన పేస్-బోపన్న ద్వయం ఒత్తిడిని జయించి 1-6, 6-7(4/7), 6-3, 6-3, 8-6 తేడాతో నెనాద్ జిమోనిచ్-ఇలిజా బోజోల్జక్పై నెగ్గింది. రెండు గంటలా 58 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో బోజోల్జక్ పదునైన సర్వీస్‌ల ముందు భారత జోడి ప్రభావం చూపలేకపోయింది. మూడో సెట్లోనూ సెర్బియా 3-2 ఆధిక్యంలో ఉన్న దశలో 38 ఏళ్ల జిమోనిచ్ మెడ నొప్పి కారణంగా చికిత్స తీసుకున్నాడు. ఈ విరామంలో ప్రత్యర్థి ఆటలో లయ తప్పగా ఇటు పునరుత్తేజం పొందిన భారత ఆటగాళ్లు పుంజుకున్నారు. దీంతో 6-3తో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌లో నిలబడగలిగారు. నెట్ దగ్గర, బ్యాక్ కోర్టులో పేస్ విన్నర్స్ షాట్స్ ఆకట్టుకోగా బోపన్న కూడా తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. ఈ దశలో అటు ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు లభించింది. ఈ ఊపులో నాలుగో సెట్లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన భారత జోడి 17 నిమిషాల్లోనే ముగించింది. నిర్ణాయక చివరి సెట్ హోరాహోరీగా సాగినా 14వ గేమ్‌లో జిమోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్ జట్టును సంబరంలో ముంచాడు. -
డేవిస్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
బెంగళూర్: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్ కు తన తొలి మ్యాచ్ లో చుక్కెదురైంది. డేవిస్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసింది. సెర్బియా స్టార్ ఆటగాడు దుసాన్ లాజోవిచ్ 6-3,6-2,7-5 తేడాతో భారత క్రీడాకారుడు యుకీ బాంబ్రీని మట్టికరిపించాడు. దీంతో డేవిస్ కప్ లో సెర్బియా తొలి విజయాన్ని నమోద చేసింది. వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శుక్రవారం ఆరంభమైన ఈ పోరులో యుకీ బాంబ్రీ తీవ్ర ఒత్తిడితో ఆటను కొనసాగించాడు. వరుస సెట్లను కోల్పోయి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమై ఓటమి చవిచూసింది. 2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది. -
సింగిల్స్ గెలిస్తేనే...
- సెర్బియాతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి - యూకీ X లాజోవిచ్; సోమ్‌దేవ్ X క్రాజినోవిచ్ బెంగళూరు: వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో పాటు మూడేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు సెర్బియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సొంత గడ్డపై ఈ టోర్నీ ఆడటం భారత్‌కు అనుకూలాంశంమే అయినప్పటికీ ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. 2010లో వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించిన భారత్... 2011లో సెర్బియా చేతిలో ఓడటంతో ఆసియా / ఓసియానియా గ్రూప్‌కు పడిపోయింది. అప్పటి నుంచీ గ్రూప్ దశలోనే ఆడుతున్న భారత్‌కు మళ్లీ ఇప్పుడు వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించే మంచి అవకాశం వచ్చింది. అయితే ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, టిప్సరెవిచ్, విక్టర్ ట్రోస్కీలు ఈ టోర్నీకి గైర్హాజరైనా మిగతా ఆటగాళ్లతో సెర్బియా పటిష్టంగా ఉంది. యూకీతో లాజోవిచ్... ఈ టోర్నీలో భారత్ ముందడుగు వేయాలంటే సింగిల్స్ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. తొలి సింగిల్స్‌లో యువ ఆటగాడు యూకీ బాంబ్రీ... ప్రపంచ 61వ ర్యాంకర్ డుసాన్ లాజోవిచ్ను ఎదుర్కొంటాడు. మడమ గాయం నుంచి కోలుకున్న యూకీ ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాళ్లతో ఆడిన మ్యాచ్‌ల్లో లాజోవిచ్ కేవలం నాలుగుసార్లు మాత్రమే ఓడటం అతని సత్తాను తెలియజేస్తోంది. రెండో సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్.. ప్రపంచ 107వ ర్యాంకర్ క్రాజినోవిచ్తో అమీతుమీ తేల్చుకుంటాడు. అయితే గత ఆరు నెలలుగా ఏటీపీ సర్క్యూట్లో సోమ్‌దేవ్ తొలి రౌండ్‌ను దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ లియాండర్ పేస్-రోహన్ బోపన్న... జిమోన్జిక్-బొజోల్జిక్లతో తలపడతారు. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగుతాయి. ఈ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుందని పేస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒత్తిడిని ఎంత వరకు జయిస్తామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నాడు. మరోవైపు యూకీ తొలి సింగిల్స్ ఆడటంపై నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోపన్నకు ‘నిబద్ధత’ అవార్డు భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న డేవిస్ కప్ కమిట్మెంట్ అవార్డు అందుకోనున్నాడు. డేవిస్ కప్‌లో తమ జాతీయ జట్టు తరఫున అంకిత భావంతో ఆడే ఆటగాళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఆటగాళ్ల శ్రమకు ఈ అవార్డు గుర్తింపు ఇస్తుందని ఐటీఎఫ్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో రికీ అన్నారు. శుక్రవారం ఇక్కడ సెర్బియాతో మ్యాచ్ సందర్భంగా బోపన్నకు అవార్డు అందజేస్తారు. లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా), గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.