ఆశలు సజీవం
ఆశలు సజీవం
Published Sun, Sep 14 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
బెంగళూరు: ఓవైపు కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్... అప్పటికే వరుసగా రెండు సెట్లలో ఓటమి... మరో సెట్ కోల్పోతే అంతే.. కానీ దేశం కోసం బరిలోకి దిగిన ప్రతీసారి పోరాట యోధుడిలా చెలరేగే దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ ఈ సమయంలో అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. సహచరుడు రోహన్ బోపన్నతో చక్కటి సమన్వయం ఏర్పరుచుకుని ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో భారత ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు నెగ్గితేనే వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధిస్తారు.
సెర్బియాతో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయాలే ఎదురుకాగా... శనివారంనాటి డబుల్స్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ దశలో స్వదేశంలో తొలిసారిగా కలిసి ఆడిన పేస్-బోపన్న ద్వయం ఒత్తిడిని జయించి 1-6, 6-7(4/7), 6-3, 6-3, 8-6 తేడాతో నెనాద్ జిమోనిచ్-ఇలిజా బోజోల్జక్‌పై నెగ్గింది. రెండు గంటలా 58 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో బోజోల్జక్ పదునైన సర్వీస్‌ల ముందు భారత జోడి ప్రభావం చూపలేకపోయింది. మూడో సెట్‌లోనూ సెర్బియా 3-2 ఆధిక్యంలో ఉన్న దశలో 38 ఏళ్ల జిమోనిచ్ మెడ నొప్పి కారణంగా చికిత్స తీసుకున్నాడు. ఈ విరామంలో ప్రత్యర్థి ఆటలో లయ తప్పగా ఇటు పునరుత్తేజం పొందిన భారత ఆటగాళ్లు పుంజుకున్నారు. దీంతో 6-3తో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌లో నిలబడగలిగారు.
నెట్ దగ్గర, బ్యాక్ కోర్టులో పేస్ విన్నర్స్ షాట్స్ ఆకట్టుకోగా బోపన్న కూడా తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. ఈ దశలో అటు ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు లభించింది. ఈ ఊపులో నాలుగో సెట్‌లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించిన భారత జోడి 17 నిమిషాల్లోనే ముగించింది. నిర్ణాయక చివరి సెట్ హోరాహోరీగా సాగినా 14వ గేమ్‌లో జిమోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పేస్ జట్టును సంబరంలో ముంచాడు.
Advertisement
Advertisement