
ఆర్థర్ ఆష్ ఓ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. అమెరికా జాతీయుడు. అమెరికా డేవిస్ కప్ జట్టుకు ఎంపికైన తొలి నీగ్రో ఇతను. అలాగే టెన్నిస్ చరిత్రలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన తొలి నీగ్రో జాతీయుడు కూడా ఇతనే కావడం విశేషం. ఓమారు బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఇతనికి రక్తం కావలసివచ్చింది. అలా రక్తం ఎక్కించినప్పుడు ఇతనికి ఎయిడ్స్ వచ్చింది. అయితే ఎయిడ్స్ వచ్చిన వాళ్లు బాధకూడదని, వారిని చైతన్యపరచడంకోసం ఇతను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇతనిని ఓ పాత్రికేయుడు కలిసి ‘మీకీ జబ్బు వచ్చినందుకు ఆ భగవంతుడిని కోపగించుకున్నారా?‘ అని ప్రశ్నించాడు.
దానికి ఆష్ జవాబిస్తూ తొలి నీగ్రో జాతీయుడిగా వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పని నేను ఈరోజు ఎయిడ్స్‌తో బాధపడుతున్నాను కదాని దేవుడిని నిందించడం అర్థరహితమని అన్నాడు. ఖర్మఫలాన్ని అనుభవించకతప్పదని అన్నాడు ఆష్. మనం చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితాలు పొందుతామని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నాడు. విజయాలు సాధించినప్పుడు ఉప్పొంగిపోవడం, ఓడిపోయినప్పుడు కృంగిపోవడం తగదని, దేనినైనా ఒకేలా స్వీకరించకతప్పదని అతను చెప్పాడు.
– యామిజాల జగదీష్
Comments
Please login to add a commentAdd a comment