
సాధారణంగా డేవిస్ కప్ మ్యాచ్‌లు హార్డ్ కోర్టులో జరుగుతాయి. ఇటలీకి ఆ కోర్టుల్లో పట్టుంది. వారిని ఓడించే వ్యూహంతో భారత్... కోల్‌కతాలో గ్రాస్ కోర్టులపై ఆడించింది. కానీ, ఈ ఎత్తుగడలేమీ పారలేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో భారత్ విఫలమైన వేళ... చెలరేగిన ఇటలీ తొలిసారి డేవిస్ కప్ వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
కోల్‌కతా: తొలిరోజు రెండు మ్యాచ్‌ల్లోనూ చేదు ఫలితాలే ఎదురైనా... శనివారం డబుల్స్ మ్యాచ్ ఊపిరిపోసింది. కానీ రివర్స్ సింగిల్స్‌తో కథ మళ్లీ మొదటికొచ్చింది. చివరకు ఇటలీతో జరిగిన డేవిస్ కప్ పోరులో భారత్ 1–3తో పరాజయం చవి చూసింది. ప్రత్యర్థికి అంతగా పట్టులేని గ్రాస్ కోర్టులోనూ చక్కని విజయాలతో ఇటలీ డేవిస్‌కప్ వరల్డ్ ఫైనల్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి అర్హత సంపాదించింది. మొదటి రోజే 0–2తో వెనుకబడిన భారత శిబిరంలో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ ఆశలు రేపింది. కలకత్తా సౌత్‌క్లబ్‌లో శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జోడీ 4–6, 6–3, 6–4తో సిమోన్ బొయెలీ–మాటియో బెరెటిని జంటపై విజయం సాధించింది.
తొలి సెట్ ఓటమి తర్వాత ఒక్కసారిగా భారత ద్వయం పుంజుకుంది. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. చివరకు గంటా 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న–దివిజ్ జంట 2–1 సెట్లతో జయభేరి మోగించింది. దీంతో భారత్ 1–2తో టచ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ రివర్స్ సింగిల్స్ ఫలితం భారత్‌ను ముంచింది. ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి 6–1, 6–4తో భారత టాప్ ర్యాంకర్, ప్రపంచ 102వ ర్యాంకు ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌ను ఓడించడంతో పరాజయం ఖాయమైంది. తొలి సెట్‌లో సెప్పి ధాటికి భారత ఆటగాడు నిలువలేకపోయాడు. శరవేగంతో సెట్‌ను ముగించిన ఇటలీ ఆటగాడికి రెండో సెట్‌లో కాస్త పోటీ ఎదురైంది.
చివరకు 62 నిమిషాల్లో సెట్‌తో పాటు మ్యాచ్‌ను ముగించాడు. ఫలితం తేలిపోవడంతో రెండో రివర్స్ సింగిల్స్‌ను ఆడించలేదు. ఈ విజయంతో ముఖాముఖీ పోటీల్లో ఇటలీ ఆధిపత్యం 5–1కు పెరిగింది. భారత్ ఇదే కలకత్తా సౌత్‌క్లబ్ కోర్టులో 1985లో జరిగిన డేవిస్ పోరులో గెలిచింది. కానీ ఈ పరాజయంతో ప్రపంచ 19వ ర్యాంకరైన భారత్ జోన్ గ్రూప్‌కు పడిపోయింది. మాడ్రిడ్ (స్పెయిన్)లో నవంబర్‌లో జరిగే 12 జట్ల ఫైనల్స్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఇటలీ పాల్గొంటుంది.
సింగిల్స్‌లో కనీసం ఒక మ్యాచ్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ తొలిరోజు (శుక్రవారం) రెండు సింగిల్స్‌ల్లోనూ ఓడటం ప్రతికూలించింది. 0–2తో వెనుకబడి పుంజుకోవడమనేది మానసికంగా కష్టసాధ్యమైంది. ఇప్పుడిప్పుడే భారత టెన్నిస్ మెరుగుపడుతోంది. నిజానికి బాక్సర్లు, రెజ్లర్లకు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం టెన్నిస్ ప్లేయర్లకు ఆర్థిక సహకారం ఇవ్వడం లేదు. టెన్నిస్‌లో సింగిల్స్ ఆటగాళ్లకు టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ద్వారా చేయూతనివ్వాలి. ఎందుకంటే సింగిల్స్ ఆటగాళ్లకు సరైన అండదండలు లేవు. ‘ఐటా’ దగ్గరేమో నిధులుండవు. ప్రభుత్వం ప్రజ్నేశ్, రామ్‌కుమార్‌లకూ సాయమందిస్తే ఫలితాలు మరోలా ఉంటాయి.
– మహేశ్ భూపతి,భారత నాన్‌ప్లేయింగ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment