వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో చోటుపై భారత్ దృష్టి
నేటి నుంచి కివీస్‌తో డేవిస్ కప్ పోరు
క్రైస్ట్‌చర్చ్: ప్రత్యర్థి జట్టు కంటే అక్కడి వాతావరణం నుంచే ఎక్కువ సవాలు ఎదురుకానున్న నేపథ్యంలో భారత్ జట్టు డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి జరగనున్న ఆసియా ఓసియానియా గ్రూప్-1లో రెండో రౌండ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. పేపర్ మీద బలంగా కనిపిస్తున్న భారత్ జట్టు... ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే కివీస్‌లో ఉష్ణోగ్రత 5 నుంచి 7 డిగ్రీలు మాత్రమే నమోదవుతోంది. ఈ ప్రతికూలతను అధిగమించి కివీస్‌ను ఏ మేరకు నిలువరిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం.
మ్యాచ్‌లన్నీ ఇండోర్ స్టేడియంలో జరిగినా ఇప్పటి వరకు భారత ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేదు. కివీస్‌తో తలపడిన చివరి నాలుగుసార్లూ భారత్ ఓడిపోలేదు. చండీగఢ్‌లో ఆడినప్పుడైతే 5-0తో వైట్‌వాష్ చేసింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో ప్రపంచ 148వ ర్యాంకర్ సోమ్‌దేవ్... ప్రపంచ 345వ ర్యాంకర్ జోస్ సాంతమ్‌తో; రెండో సింగిల్స్‌లో 151వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ... 548వ ర్యాంకర్ మైకేల్ వీనస్‌తో తలపడతారు. శనివారం జరిగే డబుల్స్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని... మార్కస్ డానియెల్-అర్టెమ్ సీతక్‌లను ఎదుర్కొంటారు. ఆదివారం జరిగే రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్.. వీనస్‌తో; యూకీ... సాంతమ్‌తో అమీతుమీ తేల్చుకుంటారు.