ఓపెనింగ్‌ పరీక్ష | India Practice Match Against New Zealand On 14/02/2020 | Sakshi
Sakshi News home page

ఓపెనింగ్‌ పరీక్ష

Published Fri, Feb 14 2020 1:15 AM | Last Updated on Fri, Feb 14 2020 1:15 AM

India Practice Match Against New Zealand On 14/02/2020 - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు పంచుకున్న తర్వాత టెస్టు పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్‌ సన్నద్ధమవుతుంది. అయితే ఈ నెల 21నుంచి జరిగే తొలి టెస్టుకు ముందు సన్నాహకంగా టీమిండియా మరో మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. నేటినుంచి ఇక్కడి సెడెన్‌ పార్క్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో భారత్‌ తలపడుతుంది. ఇటీవలి కాలంలో ప్రత్యర్థులకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం నాసిరకం వేదికలు ఇవ్వడం, దిగువ స్థాయి ఆటగాళ్లను బరిలోకి దించడం వంటివి ఆతిథ్య జట్లు తరచుగా చేస్తున్న నేపథ్యంలో తాజా మ్యాచ్‌ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కివీస్‌ సీనియర్, ‘ఎ’ జట్లకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ సరైన రీతిలో మ్యాచ్‌ను ఉపయోగించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఓపెనర్లను పరీక్షించడం, పేస్‌ బౌలర్ల ఫిట్‌నెస్‌ తదితర అంశాలను పరిశీలించుకోవడం టీమిండియాకు తొలి టెస్టుకు ముందు ప్రధాన లక్ష్యం. మూడు రోజుల మ్యాచ్‌ కాబట్టి ప్రధాన ఆటగాళ్లందరికీ బ్యాటింగ్, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ లభించవచ్చు.

మయాంక్‌కు జోడీగా... 
సొంతగడ్డపై వరుస విజయాలు సాధించిన భారత టెస్టులో జట్టులో ఓపెనర్లుగా రోహిత్, మయాంక్‌ భారీగా పరుగులు సాధించారు. ఇప్పుడు గాయంతో రోహిత్‌ సిరీస్‌కు దూరం కావడంతో మయాంక్‌కు జోడీగా మరో ఆటగాడిని దించడం అనివార్యమైంది. నిజానికి మయాంక్‌ ఫామ్‌ కూడా గొప్పగా లేదు. ‘ఎ’ జట్టు తరఫున అనధికారిక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో విఫలం కావడంతో పాటు అతని పేలవ డిఫెన్స్‌పై విమర్శలు వచ్చాయి.

ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన పృథ్వీ షా తన సత్తా చాటి పునరాగమనం చేయగా...‘ఎ’ మ్యాచ్‌లలో 83, 204 నాటౌట్, 136 స్కోర్లతో గిల్‌ చెలరేగాడు. తాజా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ వీరిద్దరి ప్రదర్శనను అంచనా వేయడానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.  ఇషాంత్‌ దాదాపుగా సిరీస్‌కు దూరమయ్యాడు కాబట్టి బుమ్రా, షమీలపై బాధ్యత మరింత పెరిగింది. శనివారం జరిగే ఫిట్‌నెస్‌ టెస్టులో అర్హత సాధిస్తేనే ఇషాంత్‌ జట్టుతో చేరవచ్చు. ఉమేశ్‌ యాదవ్‌కు విదేశాల్లో తనను తాను నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఈ మ్యాచ్‌లో రాణిస్తే మూడో పేసర్‌గా అతని స్థానం ఖాయమవుతుంది. ఇంత వరకు అరంగేట్రం చేయని నవదీప్‌ సైనీనుంచి అతనికి పోటీ పొంచి ఉంది. ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ప్రాక్టీస్‌కు కూడా మ్యాచ్‌ సరైన వేదిక.

దీటైన జట్టు... 
న్యూజిలాండ్‌ ఎలెవన్‌ తరఫున ఆడుతున్న జట్టులో పలువురు గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. జాతీయ జట్టు రెగ్యులర్‌ క్రికెటర్లు ఇష్‌ సోధి, జిమ్మీ నీషమ్, వికెట్‌ కీపర్‌ టీమ్‌ సీఫెర్ట్‌లతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వీరంతా ఇటీవల భారత్‌తో వన్డే, టి20 సిరీస్‌లలో తలపడిన జట్టులో ఉన్నవారే. కుగ్‌లీన్, టిక్‌నర్‌లు కూడా సొంత మైదానంలో చెలరేగిపోగల సమర్థులు. డరైన్‌ మిషెల్, టామ్‌ బ్రూస్‌వంటి టెస్టు స్పెషలిస్ట్‌లు కూడా తమ సత్తా చాటాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ జట్టు గనక టీమిండియాను ఇబ్బంది పెట్టగలిగితే రాబోయే టెస్టు సిరీస్‌లో భారత్‌కు సవాల్‌ ఎదురవడం ఖాయం.

పృథ్వీతో పోటీ లేదు
యువ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తనకు ఓపెనింగ్‌లో పృథ్వీ షాతో పోటీ లేదన్నాడు. అయితే అవకాశం వస్తే దాన్ని జారవిడుచుకోనని చెప్పాడు. ఇటీవలే న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టుల్లో భారత్‌ ‘ఎ’ తరఫున గిల్‌ అద్భుతంగా రాణించాడు. డబుల్‌ సెంచరీ, సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్‌లో జరిగే తొలి టెస్టులో అతను ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో పృథ్వీషాతో అతను పోటీ పడుతుండటంపై చర్చ మొదలైంది. దీనిపై అతను మాట్లాడుతూ ‘పృథ్వీ నా అండర్‌–19 సహచరుడు. ఇద్దరి కెరీర్‌లు ఒకేసారి మొదలయ్యాయి. కానీ అతనితో నాకు పోటీ లేదు. మేమిద్దరం బాగా ఆడుతున్నాం. జట్టులో ఎవరుండాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తుంది. అయితే ఇది మా మధ్య పోటీ కానేకాదు. ఎవరికి అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని వృథా చేయొద్దు’ అని అన్నాడు.

ఆరు వారాలుగా భారత్‌ ‘ఎ’ తరఫున కివీస్‌లో ఉండటంతో అక్కడి పరిస్థితులు, పిచ్‌లను అతను చక్కగా అలవాటు చేసుకున్నాడు. దీంతో అనధికారిక టెస్టుల్లో 20 ఏళ్ల గిల్‌ విశేషంగా రాణించాడు. అక్కడి పేసర్లతో జాగ్రత్త అని చెప్పాడు. ‘కివీస్‌ బౌలింగ్‌ అటాక్‌ వికెట్లు పడగొట్టేందుకు షార్ట్‌పిచ్‌ బంతుల్నే సంధిస్తుంది. ముఖ్యంగా నీల్‌ వాగ్నర్‌తో అప్రమత్తంగా ఉండాలి. వాళ్లు ఆడిన ఆస్ట్రేలియా సిరీస్‌నే పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వికెట్లు పడకపోతే... ఇక పిచ్‌తో లాభం లేదని అదేపనిగా షార్ట్‌పిచ్‌ బంతుల్నే ప్రయోగించారు. బ్యాట్స్‌మన్‌ గా నేను చెప్పేది ఒకటే... షార్ట్‌పిచ్‌ బంతుల్ని అలా వదిలేస్తేనే మనం పరుగులు చేయగలం’ అని శుబ్‌మన్‌ వివరించాడు.

అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తాయన్నాడు. ఈ పరిస్థితుల ఆధారంగానే వారి (ఆతిథ్య బౌలర్ల) ప్రణాళికలు ఉంటాయన్నాడు. తీవ్రంగా గాలి వీస్తే బ్యాట్స్‌మెన్‌కు పుల్‌ షాట్లు, హుక్‌ షాట్లు ఆడటం కష్టమవుతుందని చెప్పాడు. నాలుగో స్థానంలో ఆడటం కన్నా ఓపెనర్‌గా దిగడమే బాగుంటుందని... యథేచ్చగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పాడు. అదే 4వ స్థానమైతే అప్పటికే 2 వికెట్లు పడిన ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. ‘న్యూజిలాండ్‌ కంటే ఇంగ్లండ్‌లోనే స్వింగ్‌ ఎక్కువ అవుతుంది. అక్కడ ఎరుపురంగు డ్యూక్స్‌ బంతుల్ని ఎదుర్కోవడం కష్టం. కానీ కివీస్‌లో అలా వుండదు. ఇక్కడి వికెట్లు బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటాయి. అయితే బౌన్స్‌ను ఎదుర్కోవడమే కాస్త కష్టం’ అని గిల్‌ విశ్లేషించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement