భారత్ ప్రత్యర్థి స్పెయిన్
డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్
లండన్: ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్‌కు బలమైన ప్రత్యర్థి ఎదురైంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 16 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టుతో భారత్ తలపడనుంది. డేవిస్ కప్‌లో ఇప్పటివరకు భారత్, స్పెయిన్ ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. చివరిసారి 1965లో స్పెయిన్‌తో తలపడిన భారత్ 2-3తో ఓడిపోయింది.
స్పెయిన్ జట్టులో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్, ప్రపంచ 15వ ర్యాంకర్ రొబెర్టో బాటిస్టా అగుట్, ప్రపంచ 21వ ర్యాంకర్ ఫెలిసియానో లోపెజ్ ఉన్నప్పటికీ... గాయాల కారణంగా నాదల్, ఫెరర్ బరిలో దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నాదల్, ఫెరర్ లేకపోయినప్పటికీ స్పెయిన్‌ను ఓడించాలంటే భారత క్రీడాకారులు తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎలాంటి కోర్టుపై మ్యాచ్‌లు నిర్వహించాలో ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత ఏఐటీఏ నిర్ణయిస్తుంది.