తొలి రోజు సమం
భారత్, కొరియా 1-1
సోమ్‌దేవ్ గెలుపు, సనమ్ ఓటమి
బుసాన్ (కొరియా): డేవిస్‌కప్ ఆసియా ఓషియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌లో తొలి రోజు భారత్, కొరియా జట్లు 1-1తో సమంగా నిలిచాయి. శుక్రవారం మొదలైన రెండో రౌండ్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన కొరియా... భారత్‌కు తొలి రోజే గట్టిపోటీనిచ్చింది. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌ను అతనికంటే తక్కువ ర్యాంక్ ఉన్న హేయాన్ చుంగ్ ఓడించినంత పనిచేశాడు.
మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 7-6 (7/3), 6-4తో చుంగ్‌పై పోరాడి గెలిచాడు. మొదటి సెట్‌లో 1-4తో, రెండో సెట్‌లో 2-5తో వెనుకబడి ఉన్న సమయంలో అద్భుతమైన ఆటతీరుతో సోమ్‌దేవ్ పుంజుకున్నాడు.
మూడో సెట్‌లో మరో అవకాశం ఇవ్వకుండా ఆడి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అయితే రెండో సింగిల్స్‌లో సనమ్‌సింగ్ నిరాశపరిచాడు. గాయం కారణంగా యూకీ బాంబ్రీ డేవిస్‌కప్‌కు దూరం కావడంతో సింగిల్స్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న సనమ్‌సింగ్ 6-7 (5/7), 4-6, 4-6తో కొరియా టాప్ ప్లేయర్ లామ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇరు జట్లు సమంగా నిలవడంతో శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో హ్యుంగ్ తైక్ లీ-సంగ్ వు నో ద్వయంతో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని జోడి తలపడనుంది.