
'నన్ను ఎందుకు తప్పించారు?'
న్యూఢిల్లీ:తనను భారత డేవిస్ కప్ జట్టు నుంచి తప్పించడంపై టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు భారత డేవిస్ కప్ జట్టు నుంచి ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. డేవిస్ కప్ కు అఖిల భారత టెన్నిస్ సంఘం(ఏఐటీఏ) సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న బోపన్న.. ర్యాంకులు ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐటాకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని ఎంపిక చేసి, మిగతా వారిపై వేటు వేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశాడు.
అయితే దీనిపై భారత డేవిస్ కప్ కోచ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు జీషన్ అలీ మాత్రం ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ప్రతీసారి సెలక్టర్లు ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ సర్దుకునే యత్నం చేశారు. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే కచ్చితంగా కుదురుతారో వారినే ఎంపిక చేసినట్లు జీషన్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన భారత డేవిస్ కప్ జట్టులో రోహన్ బోపన్నకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఇందులో లియాండర్ పేస్ , సాకేత్ మైనేని, రామ్ నాథన్ రామ్ కుమార్, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్, యుకీ బాంబ్రీలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లతో పాటు, ఇద్దరు డబుల్స్ స్పెషలిస్టులను ఏఐటీఏ ఎంపిక చేసింది. ఇక్కడ వ్యక్తిగత డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ 59వ ర్యాంకులో ఉండగా, బోపన్న 28వ ర్యాంకులో ఉన్నాడు. డేవిస్ కప్ అర్హతలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణేలో జరిగే ఆసియా ఓసియానియా టోర్నీలో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.