2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు... లియాండర్ పేస్‌తో డబుల్స్ ఆడేది లేదని మహేశ్ భూపతి, రోహన్ బోపన్న పట్టు... బలవంతంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్ భాగస్వామిగా సానియా మీర్జా... పురుషాధిక్య ప్రపంచంలో తనను బలి పశువును చేశారని సానియా తీవ్ర వ్యాఖ్య!
2016 రియో ఒలింపిక్స్‌కు ముందు... పేస్‌తో కలిసి ఆడనని, డబుల్స్‌లో సాకేత్ మైనేనితోనే బరిలోకి దిగుతానని బోపన్న పట్టు... అలా కుదరదంటూ బలవంతంగా జోడీని ఎంపిక చేసిన ఏఐటీఏ!!
2020 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు... ఇంకా వివాదమేమీ లేదు, అంతా బాగుందనే అనిపించిది. కానీ అలా అయితే అది భారత టెన్నిస్ ఎలా అవుతుంది...ఆటలకు ముందు వ్యాఖ్యల దుమారం రేగింది!!!
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో తాను పాల్గొనే అవకాశాల విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అందరినీ తప్పుదోవ పట్టించిందని టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న వ్యాఖ్యానించాడు. సుమిత్ నగాల్‌కు జోడీగా తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించారని అతను విమర్శించాడు. బోపన్న వ్యాఖ్యలకు సానియా మీర్జా మద్దతు పలకగా... ఏఐటీఏ ప్రతిగా స్పందిస్తూ ఇద్దరి విమర్శలను ఖండించింది.
నేపథ్యమిదీ...
ఒలింపిక్స్ పురుషుల డబుల్స్‌లో పాల్గొనే జోడీగా రోహన్ బోపన్న–దివిజ్ శరణ్‌ల పేర్లను ఏఐటీఏ ప్రకటించింది. అయితే వీరిద్దరి ‘సంయుక్త ర్యాంక్’ 113 కాగా... అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కారణంగా వీరు అర్హత సాధించలేకపోయారు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో పలువురు తప్పుకోవడంతో అనూహ్యంగా సుమిత్ నగాల్ అర్హత సాధించాడు. దాంతో దివిజ్ స్థానంలో నగాల్‌ను చేర్చి కొత్తగా ఈ జోడీని పరిశీలించమంటూ ఐటీఎఫ్‌ను ఏఐటీఏ కోరింది. చివరకు బోపన్న–నగాల్ జోడీకి కూడా అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై వ్యాఖ్య చేసిన బోపన్న... అసలు ఏఐటీఏ అలాంటి ప్రయత్నమే చేయలేదని విమర్శించాడు.
‘నగాల్‌తో నా జోడీని ఐటీఎఫ్ అసలు అంగీకరించనే లేదు. గాయం తదితర బలమైన కారణం ఉంటే తప్ప చివరి తేదీ అయిన జూన్ 22 తర్వాత ఎలాంటి మార్పులు అంగీకరించబోమని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. అయినా సరే మాకేదో అవకాశం ఉందని, తామేదో చేస్తున్నట్లుగా ఆటగాళ్లు, ప్రభుత్వం, మీడియా... ఇలా అందరినీ ఏఐటీఏ తప్పుదోవ పట్టించింది’ అని బోపన్న ట్వీట్ చేశాడు. దీనిని మద్దతుగా సానియా...‘అవునా...ఇదే నిజమైతే చాలా ఘోరం. సిగ్గు పడాల్సిన విషయం. దీని ప్రకారం చూస్తే మనిద్దరం కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశం కూడా కోల్పోయాం. నీతో పాటు సుమిత్ పేరు పంపించినట్లు నాకు కూడా చెప్పారు’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విమర్శలన్నింటికీ ఏఐటీఏ కొట్టి పారేసింది.
బోపన్న, సానియా వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం. వారికి అసలేం తెలీదు. అర్హత గురించి రూల్ బుక్ చదివి మాట్లాడితే బాగుండేది. డబుల్స్ జోడీని మార్చమంటూ మేం ఐటీఎఫ్‌కి విజ్ఞప్తి చేశాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే అది సాధ్యమవుతుందని వారు మాకు చెప్పారు. అయినా సరే డెడ్‌లైన్ ముగియడానికి ఏడు గంటల ముందు వరకు కూడా సమాచారం ఇస్తామని చెప్పి మేమూ వేచి చూసేలా చేశారు. ఇందులో తప్పుదోవ పట్టించడం ఏముంది. దాని వల్ల మాకేంటి లాభం. బోపన్న ఒలింపిక్స్‌లో ఆడాలని అతనికి సహాయం చేసేందుకే ప్రయత్నించాం. అంతగా అనుకుంటే అతను సొంతంగా తన ర్యాంకింగ్‌తో అర్హత సాధించాల్సింది. –అనిల్ ధుపార్, ఏఐటీఏ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment