
బోపన్న ‘సింగిల్స్’ విజయం
డేవిస్ కప్‌లో భారత్ 4-1తో కొరియాపై గెలుపు
చండీగఢ్: తొలి రెండు రోజులు విజయాలతో అదరగొట్టిన భారత డేవిస్ కప్ జట్టు ఆఖరి రోజు మాత్రం ఒక్క గెలుపుతోనే సంతృప్తి పడింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో రోహన్ బోపన్న 3-6, 6-4, 6-4తో హంగ్ చుంగ్‌పై గెలవగా... రెండో మ్యాచ్‌లో రామ్‌కుమార్ 3-6, 7-5, 6-7 (2/7)తో యంగ్ కు లిమ్ చేతిలో ఓడాడు. దీంతో కొరియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం దక్కించుకుంది.
సాకేత్ మైనేని సకాలంలో కోలుకోకపోవడంతో నాలుగేళ్ల తర్వాత బోపన్న సింగిల్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. 2012లో ఉజ్బెకిస్తాన్‌తో బోపన్న చివరిసారి సింగిల్స్ మ్యాచ్ ఆడాడు. డేవిస్‌కప్‌లో బోపన్నకిది 10వ సింగిల్స్ విజయం. చుంగ్‌తో గంటా 23 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ భారీ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 27 ఏస్‌లు సంధించాడు.
లిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇద్దరూ చెరో సెట్‌ను సాధించారు. కానీ మూడోసెట్ టైబ్రేక్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌లు అదుపు తప్పడంతో మూల్యం చెల్లించుకున్నాడు.