
నాదల్,పేస్
* నాదల్ నుంచి యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి
* భారత దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ కెరీర్... 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్... వరుసగా ఏడు ఒలింపిక్స్‌లు ఆడిన ఏకైక టెన్నిస్ ప్లేయర్... డేవిస్ కప్‌లో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన రికార్డు సమం.. ఇలా చెప్పుకుంటూ పోతే భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో ఘనతలు ఎన్నో ఉన్నాయి. 43 ఏళ్ల వయస్సులోనూ యువ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆడుతోన్న పేస్... తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకునేందుకు రాఫెల్ నాదల్ లాంటి ఆటగాళ్ల నుంచీ నేర్చుకోవడానికి సిద్ధమేనని తెలిపాడు. స్పెరుున్ జట్టుతో శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత జట్టు తలపడనున్న నేపథ్యంలో పేస్ వెలుబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...
అందరూ చూసేందుకు రావాలి: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్, ప్రపంచ 13వ ర్యాంకర్ డేవిడ్ ఫెరర్... ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ చాంపియన్ జంట ఫెలిసియానో లోపెజ్, మార్క్ లోపెజ్‌లతో స్పెరుున్ ఇక్కడకు రావడం వారి ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఒకరకంగా ఈ మ్యాచ్ జరిగే మూడు రోజులు టెన్నిస్ అభిమానులకు పండగే. నేనే గనుక జూనియర్ ప్లేయర్ అరుుఉంటే ప్రతి రోజూ ఈ స్టార్స్ ఆటను చూసేందుకు వచ్చేవాడిని. నాదల్ ఏ రకంగా ఆడతాడో, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో చూసేందుకు అందరూ రావాలి.
యువ ఆటగాళ్లు నేర్చుకోవాలి: నాదల్, ఫెరర్‌లాంటి మేటి ప్లేయర్లకు భారత యువ ఆటగాళ్లు సాకేత్ మైనేని, రామ్‌కుమార్ పరీక్ష పెట్టే అవకాశం వచ్చింది. దీనిని వారు సద్వినియోగం చేసుకోవాలి. ఫలితం గురించి ఆలోచించకుండా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఏ రకంగా ఆడాలో తెలుసుకోవడానికి యువ ఆటగాళ్లందరూ నాదల్, ఫెరర్‌ల ఆటతీరును పరిశీలించాలి. జట్టులో అత్యంత సీనియర్‌ను కాబట్టి నేను యువ ఆటగాళ్లకు మార్గదర్శిగా ఉంటాను. జూనియర్ ఆటగాళ్లు నాకంటే బాగా ఆడుతూ, జట్టులో స్థానం లేదని చెప్పినరోజు నేనే వైదొలుగుతాను.