భారత్ వెనుకంజ
న్యూఢిల్లీ:డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ లో భారత్ కు చుక్కెదురైంది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన లియాండర్ పేస్-రోహన్ బోపన్నాల జోడీ 5-7, 2-6, 2-6 తేడాతో చెక్ రిపబ్లిక్ జోడీ రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ చేతిలో ఓటమి పాలై భారత ఆశలను క్లిష్టం చేసింది. తొలిరోజు సింగిల్స్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్ సంచలన విజయంతో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చినా.. ఈరోజు జరిగిన డబుల్స్ లో పేస్ జోడీ వరుస సెట్లను ప్రత్యర్థులకు అప్పగించి ఓటమి చవిచూసింది.
రెండు గంటల 10 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో స్టెపానెక్-ఆడమ్ లు దాటిగా ఆడి విజయం చేజిక్కించుకున్నారు. దీంతో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. ఈ ఓటమితో డేవిస్ కప్ డబుల్స్ విభాగంలో 15 సంవత్సరాల తరువాత పేస్ కు రెండో ఓటమి ఎదురవ్వగా, మూడు సంవత్సరాల తరువాత రోహన్ బోపన్నాకు తొలి ఓటమి. గత వారం యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ సాధించిన పేస్.. డేవిస్ కప్ డబుల్స్ లో మాత్రం విఫలం చెందాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్ లో భారత్ కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాచ్ లో సోమ్ దేవ్ దేవ్ బర్మన్-యూకీ బాంబ్రీలు గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ కు భారత్ అర్హత సాధిస్తుంది.