దేశం కోసం ఈగో పక్కనపెట్టి!
దేశం కోసం ఈగో పక్కనపెట్టి!
Published Wed, Jul 13 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM
పురుషుల డబుల్స్ టెన్నిస్ విభాగంలో రియో ఒలింపిక్స్ బెర్త్ కోసం భారత స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కోన్నా చివరికి స్థానం దక్కించుకున్నాడు. మరో డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న.. పేస్ తో జతకట్టేది లేదని గతంలో తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం విశేషం. ఇద్దరూ తమ ఈగోలను పక్కనపెట్టి ఆటకోసం ముందుకు రావడంతో పరిస్థితి 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్లు కనిపిస్తోంది. తాజాగా వారిద్దరూ డేవిస్ కప్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఛండీగఢ్ క్లబ్ లో ప్రాక్టీస్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
పేస్ సాధించిన విజయాలను చూసిన వాళ్లు అతడిని ఖచ్చితంగా గౌరవిస్తారు. ప్రపంచంలోనే డబుల్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో పేస్ ఒకడు' అని బోపన్న చెప్పాడు. అయితే పేస్ తో కలిసి ఆడనని తానెప్పుడూ చెప్పలేదని, మరో భాగస్వామిని తన ఆటతీరు బాగుంటుందని, సౌకర్యంగా ఉంటుందని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు.
గత విషయాల గురించి తాను మాట్లాడాలని భావించట్లేదని, దేశం కోసం అనగానే ఏ ఆటగాడయినా కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉంటాడని పేస్ అంటున్నాడు. వందల కోట్ల ప్రజల కోసం ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఈగోలను పక్కన పెడతామని చెప్పుకొచ్చాడు. బోపన్న చాలా శ్రమిస్తాడంటూ తన భాగస్వామిని పేస్ ప్రశంసించాడు.
Advertisement