భారత్ అదుర్స్
చండీగఢ్: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్లో భారత అదరగొడుతుంది. దక్షిణ కొరియాతో జరుగుతున్న డేవిస్ కప్ పోరులో భారత్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్ల్లో విజయం సాధించి సత్తా చాటిన భారత జట్టు.. శనివారం జరిగిన పురుషుల డబుల్స్లో కూడా విజయం సాధించింది. భారత పురుషుల డబుల్స్ లో భాగంగా లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4 తేడాతో హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ ద్వయాన్ని మట్టికరిపించింది.
తొలి సెట్ను అవలీలగా గెలిచిన పేస్ జంట.. రెండు, మూడు సెట్లలో పోరాడి గెలిచింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన డబుల్స్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అంచనాలను తగ్గట్టు రాణించి చక్కటి గెలుపును సొంతం చేసుకున్నారు. ఓవరాల్గా 17 పాయింట్లను మాత్రమే తమ సర్వీస్ల ద్వారా కోల్పోయిన భారత జట్టు ఆద్యంత నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంది. తద్వారా భారత్ 3-0 ఆధిక్యం సాధించిన భారత్.. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది.
శుక్రవారం ప్రారంభమైన డేవిస్ కప్ పోరులో భారత ఆటగాడు రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. ఇక రెండో సింగిల్ మ్యాచ్ లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో యోంగ్‌కు లిమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో సాకేత్ విజయం ఖరారైంది. ఆదివారం నాటి సింగిల్స్ మ్యాచ్లో సియోంగ్ చాన్ హాంగ్ తో సాకేత్ మైనేని తలపడతాడు.