పాక్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు! | AITA May Send 2nd String Team To Pakistan For Davis Cup | Sakshi
Sakshi News home page

పాక్‌కు భారత ద్వితీయ శ్రేణి టెన్నిస్‌ జట్టు!

Published Wed, Oct 16 2019 6:02 PM | Last Updated on Wed, Oct 16 2019 6:02 PM

AITA May Send 2nd String Team To Pakistan For Davis Cup - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) తమ విజ్ఞప్తిని తిరస్కరించి... పా​కిస్తాన్‌లో తప్పనిసరిగా డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడాల్సివస్తే... అక్కడికి ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) నిర్ణయించింది. ‘కశ్మీర్‌ హోదా’ అంశంలో దాయాదుల మధ్య సంబధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో జరగాల్సిన ఈ ఇండో–పాక్‌ డేవిస్‌ పోరును భద్రతా కారణాలతో ఐటీఎఫ్‌ వచ్చే నెలకు వాయిదా వేసింది. తటస్థ వేదిక వద్ద నిర్వహించాలని ఐటా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై వచ్చేనెల 4న ఐటీఎఫ్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడనున్నాయి. 

అయితే ఇటీవల శ్రీలంక క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఐటీఎఫ్‌ ఇస్లామాబాద్‌కే ఓటేసే అవకాశముంది. ఇందులో భారత్‌ ఆడనంటే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఐటా కీలక ఆటగాళ్లను కాకుండా ‘ద్వితీయ శ్రేణి’ జట్టుతో అక్కడ డేవిస్‌ కప్‌ పోరును మమ అనిపించాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఐటా ఉన్నతాధికారులు ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేశారు. ఇందులో నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి కూడా పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపేందుకు వీసా ప్రక్రియను ప్రారంభించామని ఐటా కార్యదర్శి హిరణ్మయ్‌ ఛటర్జీ తెలిపారు. నవంబర్‌ 29, 30 తేదీల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య టెన్నిస్‌ పోటీలు జరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement