All India Tennis Association(AITA)
-
నగాల్‌పై వేటు... యూకీకి చోటు
న్యూఢిల్లీ: డెన్మార్క్‌తో జరిగే డేవిస్ కప్ పోరు కోసం ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) సెలక్టర్లు ఎంపిక చేశారు. సుమీత్ నగాల్‌ను తప్పించి యూకీ బాంబ్రీకి చోటు కల్పించడం ఈ ఎంపికలో కీలక మార్పు. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ ‘టై’లో భాగంగా మార్చి 4, 5 తేదీల్లో భారత్, డెన్మార్క్ తలపడనున్నాయి. ఢిల్లీ జింఖానా క్లబ్‌లోని గ్రాస్ కోర్టుల్లో రెండు రోజుల పాటు సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ 222వ ర్యాంకర్ నగాల్‌ను కాదని 863 ర్యాంకర్ యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్ (182), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (228)లను సింగిల్స్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేశారు. డబుల్స్‌లో వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు స్థానం కల్పించారు. గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్ కాకపోవడంతో నగాల్‌పై వేటు పడింది. తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసినట్లు ‘ఐటా’ ఒక ప్రకటనలో తెలిపింది. భారత టెన్నిస్ జట్టుకు జీషాన్ అలీ కోచ్‌గా, రోహిత్ రాజ్‌పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు ఈ నెల 23న న్యూఢిల్లీలో బయోబబుల్‌లోకి వెళుతుంది. కరోనా నేపథ్యంలో ‘ఐటా’ సెలక్షన్ కమిటీ వర్చువల్ పద్ధతిలో సమావేశమై జట్టును ఎంపిక చేసింది. -
ఫిన్లాండ్తో ‘డేవిస్’ పోరుకు బోపన్న
సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న భారత డేవిస్ కప్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్ సంఘంతో ఒలింపిక్స్ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్ వేదికగా ఫిన్లాండ్తో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్ శరణ్–బోపన్న జంట ఆడుతుంది. -
పాక్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తమ విజ్ఞప్తిని తిరస్కరించి... పాకిస్తాన్లో తప్పనిసరిగా డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడాల్సివస్తే... అక్కడికి ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నిర్ణయించింది. ‘కశ్మీర్ హోదా’ అంశంలో దాయాదుల మధ్య సంబధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో జరగాల్సిన ఈ ఇండో–పాక్ డేవిస్ పోరును భద్రతా కారణాలతో ఐటీఎఫ్ వచ్చే నెలకు వాయిదా వేసింది. తటస్థ వేదిక వద్ద నిర్వహించాలని ఐటా ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై వచ్చేనెల 4న ఐటీఎఫ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడనున్నాయి. అయితే ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఐటీఎఫ్ ఇస్లామాబాద్‌కే ఓటేసే అవకాశముంది. ఇందులో భారత్ ఆడనంటే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఐటా కీలక ఆటగాళ్లను కాకుండా ‘ద్వితీయ శ్రేణి’ జట్టుతో అక్కడ డేవిస్ కప్ పోరును మమ అనిపించాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ఐటా ఉన్నతాధికారులు ఇదే అంశంపై తీవ్రంగా కసరత్తు చేశారు. ఇందులో నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి కూడా పాల్గొన్నారు. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపేందుకు వీసా ప్రక్రియను ప్రారంభించామని ఐటా కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ తెలిపారు. నవంబర్ 29, 30 తేదీల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య టెన్నిస్ పోటీలు జరుగుతాయి. -
క్వార్టర్స్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. హరియాణాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–2, 6–4తో సింధు జనగామ (తెలంగాణ)పై వరుస సెట్లలో గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్లో 6–3, 6–0తో షాను అగర్వాల్ (ఢిల్లీ)ని ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన షెఫాలీ అరోరాతో దేదీప్య ఆడుతుంది. -
అతడి 25 ఏళ్ల రికార్డు చూసి మాట్లాడండీ!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్పై వస్తున్న విమర్శలపై అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా) తీవ్రంగా స్పందించింది. స్టార్ ప్లేయర్ లియాండర్ కు ఆటపై ఉన్న నిబద్ధతను, అతడి అంకితభావాన్ని ఎవ్వరూ ప్రశ్నించరాదని పేర్కొంది. ప్రస్తుతం ఏడో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న పేస్ రియోకు చాలా ఆలస్యంగా రావడంతో మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ సమాఖ్య పేస్‌కు మద్ధతు తెలిపింది. డేవిస్ కప్ కెరీర్ చూస్తే చాలు పేస్ అంటే ఏంటన్నది అందరికీ అర్థమవుతుందని ఐటా సెక్రటరీ జనరల్ భరత్ ఓజా చెప్పారు. బ్రెజిల్లో అడుగుపెట్టకముందు వాషింట్టన్ కాస్టిల్స్ తరఫున వరల్డ్ టీమ్ టెన్నిస్ లో పేస్ పాల్గొన్నాడు. పేస్ 20 ఏళ్ల డేవిస్ కప్ రికార్డులు, ఆసియా గేమ్స్, ఆరు ఒలింపిక్స్ లో పాల్గొనడం గమనించిన తర్వాత పేస్పై చేస్తున్న విమర్శలను ఆపేయాలని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రాణిస్తే అన్ని విభాగాల్లో రాణించే అవకాశం ఉందని.. పేస్ పాత్ర ఎప్పుడూ కీలకమేనని భరత్ ఓజా పేర్కొన్నారు. తన భాగస్వామితో కలిసి రోహన్ బోపన్న సెర్బియాకు చెందిన జిమాంజిక్, సానియా మిర్జా(భారత్)లు ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేయడంతో పేస్ కు ఆటపై గౌరవం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టెన్నిస్ సమాఖ్య తీవ్రస్థాయిలో స్పందించింది.