అతడి 25 ఏళ్ల రికార్డు చూసి మాట్లాడండీ!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్పై వస్తున్న విమర్శలపై అఖిల భారత టెన్నిస్ సమాఖ్య(ఐటా) తీవ్రంగా స్పందించింది. స్టార్ ప్లేయర్ లియాండర్ కు ఆటపై ఉన్న నిబద్ధతను, అతడి అంకితభావాన్ని ఎవ్వరూ ప్రశ్నించరాదని పేర్కొంది. ప్రస్తుతం ఏడో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న పేస్ రియోకు చాలా ఆలస్యంగా రావడంతో మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్ సమాఖ్య పేస్కు మద్ధతు తెలిపింది. డేవిస్ కప్ కెరీర్ చూస్తే చాలు పేస్ అంటే ఏంటన్నది అందరికీ అర్థమవుతుందని ఐటా సెక్రటరీ జనరల్ భరత్ ఓజా చెప్పారు.
బ్రెజిల్లో అడుగుపెట్టకముందు వాషింట్టన్ కాస్టిల్స్ తరఫున వరల్డ్ టీమ్ టెన్నిస్ లో పేస్ పాల్గొన్నాడు. పేస్ 20 ఏళ్ల డేవిస్ కప్ రికార్డులు, ఆసియా గేమ్స్, ఆరు ఒలింపిక్స్ లో పాల్గొనడం గమనించిన తర్వాత పేస్పై చేస్తున్న విమర్శలను ఆపేయాలని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రాణిస్తే అన్ని విభాగాల్లో రాణించే అవకాశం ఉందని.. పేస్ పాత్ర ఎప్పుడూ కీలకమేనని భరత్ ఓజా పేర్కొన్నారు. తన భాగస్వామితో కలిసి రోహన్ బోపన్న సెర్బియాకు చెందిన జిమాంజిక్, సానియా మిర్జా(భారత్)లు ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేయడంతో పేస్ కు ఆటపై గౌరవం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టెన్నిస్ సమాఖ్య తీవ్రస్థాయిలో స్పందించింది.