రైట్... రైట్... పేస్
* ఒలింపిక్స్‌కు లియాండర్
* బోపన్నకు జతగా బరిలోకి
* జట్లను ప్రకటించిన ఐటా
న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలనుకున్న లియాండర్ పేస్ కల నేరవేరనుంది. రియో ఒలింపిక్స్ టెన్నిస్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్నతో జతగా పేస్ బరిలోకి దిగుతాడని అఖిల భారత టెన్నిస్ సం ఘం (ఐటా) ప్రకటించింది.
బోపన్న తన బాగస్వామిగా సాకేత్ కావాలని కోరినా... ఐటా మాత్రం పేస్ వైపే మొగ్గు చూపింది. పతకం సాధించాలంటే భారత్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లు కలిసి ఆడాలని ఐటా అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని బోపన్న కూడా అంగీకరించడంతో కథ సుఖాంతమయింది. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా ఇష్టప్రకారమే బోపన్నను ఎంపిక చేశారు. ఇక మహిళల డబుల్స్‌లో సానియా, ప్రార్థన తొంబరే జోడి బరిలోకి దిగుతుంది. డేవిస్‌కప్ కోచ్ జీషన్ అలీని జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.
డేవిస్‌కప్‌లోనూ పేస్
వచ్చే నెల 15 నుంచి కొరియా రిపబ్లిక్‌తో జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1 టై కోసం ఏడుగురితో కూడిన భారత జట్టును ఐటా ఎంపిక చేసింది. ఇందులోనూ పేస్‌కు చోటు కల్పించారు. యూకీ బాంబ్రీ, సాకేత్, బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్ జట్టులో ఉండగా విష్ణువర్ధన్, సుమీత్ నాగల్ రిజర్వ్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌ల సమయంలో పేస్, బోపన్నల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే తొలిగిపోతాయని ఐటా భావిస్తోంది.