సగర్వంగా.. తిరంగా.. | Ramkumar Ramanathan, Saketh Myneni win to give India 2-0 lead in Davis Cup against South Korea | Sakshi
Sakshi News home page

సగర్వంగా.. తిరంగా..

Published Sun, Jul 17 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

సగర్వంగా.. తిరంగా..

సగర్వంగా.. తిరంగా..

డేవిస్ కప్ ప్లే ఆఫ్‌కు భారత్
* కొరియాపై 3-0తో గెలుపు
* పేస్-బోపన్న అలవోక విజయం

చండీగఢ్: భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో భారత్ 3-0తో కొరియాపై విజయం సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం సాధించగా... శనివారం జరిగిన డబుల్స్ పోరులో లియాండర్ పేస్ - రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4తో కొరియా జోడీ హంగ్ చుంగ్ - సియోంగ్ చాన్ హంగ్‌లపై గెలిచి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం నామమాత్రపు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.
 
తడబాటు లేకుండా...
అనుభవం, నైపుణ్యంతో భారత జోడీ డబుల్స్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ ద్వయం మంచి సమన్వయంతో ఆడారు. మేఘావృతమైన వాతావరణం, ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా చేసుకున్న బోపన్న గంటకు 200 కి.మీ.ల వేగంతో సర్వీస్‌లు చేశాడు. పేస్ అద్భుతమైన వ్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో బోపన్న రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడం, మూడోసెట్‌లో పేస్ ఒకసారి సర్వీస్ చేజార్చుకోవడం మినహా భారత్ జోడి ఎక్కడా ఇబ్బందిపడలేదు.

మ్యాచ్ మొత్తంలో ఈ ఇద్దరు తమ సర్వీస్‌ల్లో కేవలం 17 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. మూడో సెట్‌లో కాస్త అలసత్వం చూపిన ఇద్దరు 10 పాయింట్లు చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో బోపన్న 9, పేస్ 3 ఏస్‌లు సంధించారు. తొలిసెట్ ఎనిమిదో గేమ్‌లో హంగ్ సర్వీస్‌ను పేస్ వ్యాలీ విన్నర్‌తో బ్రేక్ చేశాడు. దీంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి గేమ్‌లో అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండోసెట్ మూడో గేమ్‌లో మళ్లీ హంగ్ సర్వీస్‌ను పేస్ బ్రేక్ చేశాడు. వేగంగా పరుగెత్తుతూ సంధించిన లో వ్యాలీని ప్రత్యర్థులు అందుకోలేకపోయారు.

స్వల్ప ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగిస్తూ భారత్ రెండోసెట్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడోసెట్ తొలి గేమ్‌లోనే చుంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి బోపన్న జంట ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో గేమ్‌లో బోపన్న బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్నా... ఆరో గేమ్‌లో పేస్ సర్వీస్ కోల్పోయాడు. చివరకు పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.
 
మా ఇద్దరి మధ్య సమన్వయం బాగా కుదిరింది. అదే లేకపోతే ఇలాంటి విజయాలు సాధించడం కష్టం. ఈ మ్యాచ్‌లో మేం పెద్దగా కష్టపడలేదు. మా బలం మేరకు మాత్రమే ఆడాం. తక్కువ స్థాయి ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలో తెలుసు కాబట్టి ఎక్కడా ఇబ్బంది పడలేదు.
- బోపన్న
 
మేం బాగా ఆడాం. మూడు సెట్లలోనే మ్యాచ్ గెలిచాం. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మా సత్తాను మరింత చూపెట్టేవాళ్లం. కుడి, ఎడమ మేళవింపు ఎప్పుడైనా ఇబ్బందిగానే ఉంటుంది. చుంగ్ మంచి కోణాల్లో షాట్లు కొట్టాడు. హంగ్ కాస్త స్లో. సింగిల్స్‌లో మా వాళ్లు బాగా ఆడారు. కొరియాపై 3-0తో గెలవడమంటే అంత సులువుకాదు. - పేస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement