‘డబుల్’ ఫాల్ట్!
► సద్దుమణగని డేవిస్ కప్ వివాదం
► వ్యక్తిగత సంభాషణను భూపతి బయట పెట్టడంపై పేస్ ఆగ్రహం
► ఇద్దరిదీ తప్పంటున్న ఏఐటీఏ
బెంగళూరు: ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరులో విజయం సాధించి భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినా... ఈ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. పాత విభేదాలతోనే పేస్‌ను పక్కన పెట్టినట్లు వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నంలో పేస్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి బయటపెట్టగా... ఇది ముమ్మాటికీ తప్పంటూ పేస్ విమర్శించాడు. మరోవైపు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ), మాజీ ఆటగాళ్లు మాత్రం ఇద్దరినీ తప్పు పడుతున్నారు. ఈ విషయంలో పేస్, భూపతి మరింత పరిణతితో వ్యవహరించాల్సిందని వారు విమర్శించారు.
కావాలని చేయలేదు...
డేవిస్ కప్ మ్యాచ్ ఆడే తుది జట్టులో పేస్‌కు అవకాశం ఇవ్వకుండా నలుగురు ఆటగాళ్లను నాన్ ప్లేయింగ్ కెప్టెన్ హోదాలో మహేశ్ భూపతి ఎంచుకున్నాడు. అయితే తనతో పాత విభేదాల కారణంగానే ఇలా చేశారంటూ పేస్ ఆ రోజే విమర్శించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భూపతి దీనిపై వివరణ ఇస్తూ పేస్‌పై తీవ్ర విమర్శలు కూడా చేశాడు. ‘ఇందులో వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. నా ఇరవై ఏళ్ల కెరీర్‌లో ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతో తప్పనిసరి అయితే తప్ప వివరణ ఇవ్వలేదు.
1994లో తొలిసారి డేవిస్ కప్ జట్టులోకి వచ్చినప్పుడు నేను కూడా పేస్ అభిమానినే. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దానిపై నేను ఓ పుస్తకం రాయగలను. ‘గౌరవం’ అనే పదానికి అతనికి అర్థం కూడా తెలీదు. నాకు జట్టుకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏఐటీఏ స్వేచ్ఛ ఇచ్చింది. అసలు పోరు మధ్యలోనే పేస్ జట్టును వదిలి వెళ్లిపోవడం ఏమిటి’ అని మహేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆగకుండా తుది జట్టు ఎంపికకు సంబంధించి తనకు, పేస్‌కు మధ్య వాట్సప్‌లో జరిగిన చాటింగ్‌ను కూడా అతను ఈ సందర్భంగా బయట పెట్టాడు.
నన్ను ఎందుకు అవమానించారు?
అయితే భూపతి వ్యవహారశైలి పట్ల పేస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత సంభాషణను ఒక డేవిస్ కప్ కెప్టెన్ ఎలా బయటపెడతాడంటూ పేస్ ప్రశ్నించాడు. పేస్ పదే పదే కోరినా అతనికి జట్టులో స్థానంపై ఇంకా స్పష్టత ఇవ్వలేనంటూ భూపతి ఇందులో చెబుతూ వచ్చాడు. ‘మా మధ్య మాటల్లో అన్నింటికంటే ఫామ్ ప్రధానమనే చెప్పాడు. కానీ నిజంగా జట్టును ఎంపిక చేసేటప్పుడు దీనిని పట్టించుకోలేదు. నేను బెంగళూరుకు రాక ముందే నిర్ణయం తీసేసుకున్నారని అర్థమవుతోంది.
కానీ నాకు చోటు లేదని స్పష్టంగా చెప్పలేదు. ఇది నన్ను అవమానించడమే. ఇదంతా అవసరం లేదు కదా’ అని పేస్ వ్యాఖ్యానించాడు. డేవిస్ కప్‌లో తన పాత్ర గురించి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై కూడా పేస్ వివరణ ఇచ్చాడు. ‘అతని ఏకపక్ష వాదనకు నేను మున్ముందు ప్రత్యుత్తరం ఇవ్వగలను. అయితే దేశం తరఫున ఎవరు ఏం చేశారో అభిమానులకు, ప్రజలందరికీ తెలుసు. దీనిపై మాట్లాడటం వృథా. చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు’ అని పేస్ స్పష్టం చేశాడు.
సీనియర్లు ఇద్దరు ఈ విషయంలో మరింత పరిణతితో వ్యవహరించాల్సింది. మ్యాచ్ మధ్యలో పేస్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తన ఆలోచనలు, జట్టు ఎంపికపై మహేశ్ మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. అయితే జట్టులో నువ్వు భాగం కాదంటూ పేస్‌కు భూపతి కాస్త మర్యాదగా ముందే చెబితే బాగుండేది. 27 ఏళ్ల పాటు దేశం తరఫున ఆడిన వ్యక్తికి ఆ గౌరవం పొందేందుకు తగిన అర్హత ఉంది. వాట్సప్ సంభాషణ గురించి మాకూ తెలుసు. తగిన సమయంలో కూర్చొని వారిద్దరితో మాట్లాడతాం. ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలనేది మా ఆలోచన. – హిరణ్మయి ఛటర్జీ, ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి
నా దృష్టిలో ఈ వివాదం ముగిసిన అధ్యాయం. ఇప్పుడు పేస్, మహేశ్ మధ్య ఉన్న పాత గొడవలు ముఖ్యం కాదు. ప్రస్తుత స్థితిలో మన ఆటగాళ్లు వరల్డ్ గ్రూప్‌లోకి వెళ్లలేరు. ఫెడ్ కప్, గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించడంలేదు. ఇప్పుడు భారత ఆటగాళ్లను ప్రపంచ టాప్–50లోకి ఎలా తీసుకు రావాలనేదే లక్ష్యంగా ఉండాలి. అది జరిగితే అన్నీ చక్కబడతాయి. అప్పుడు మిగతాదంతా అనవసరం.
– విజయ్ అమృత్‌రాజ్, భారత మాజీ ఆటగాడు
పాత విభేదాలు మళ్లీ బయట పడటం దురదృష్టకరం. ఇందులో ఇద్దరి తప్పూ ఉంది. మహేశ్ వ్యవహారశైలి సరిగా లేదు. నువ్వు తుది జట్టులో లేవంటూ అతను పేస్‌కు ఒక మెయిల్ ఎందుకు పంపలేదు. రోహన్ బోపన్నను ఎంచుకోవాలని రెండు నెలల ముందే అనుకుంటే పేస్‌ను ఎటూ కాకుండా చేయడం ఎందుకు. తను ఆడతానని కచ్చితంగా తెలీనప్పుడు పేస్ బెంగళూరు వరకు ఎందుకు వెళ్లాడు. మ్యాచ్ మధ్యలోనే లియాండర్ వెళ్లిపోయాడని మహేశ్ విమర్శించడంలో అర్థం లేదు. అప్పటికే జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అక్కడే ఉండిపోయి అతను చేసేదేముంది. – ఆనంద్ అమృత్‌రాజ్, డేవిస్ కప్ మాజీ కెప్టెన్