భళా..భారత్
యువకులతో కూడిన భారత టెన్నిస్ జట్టు అదరగొట్టింది.మరో రెండు మ్యాచ్‌లుండగానే చైనీస్ తైపీపై విజయం సాధించి డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌తో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు సాకేత్ మైనేని చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఇండోర్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆటగాళ్లు డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో ముందంజ వేశారు. చైనీస్ తైపీతో జరుగుతున్న ఈ పోరులో భారత్ 3-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే మిగతా రెండు రివర్స్ సింగిల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా భారత జట్టు తదుపరి రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో వారి సొంతగడ్డపై తలపడనుంది. అందులోనూ గెలిస్తే భారత్ తిరిగి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగలుగుతుంది.
డబుల్స్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా బోపన్నతో కలిసి డబుల్స్ మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నెగ్గాడు. వెలుతురు మందగించడంతో అతని మ్యాచ్ శనివారం కొనసాగించగా కేవలం ఎనిమిది నిమిషాల్లోనే మిగతా ఆటను పూర్తి చేశాడు. ఈ రెండో సింగిల్స్ పోరులో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ 3-2 సెట్లతో టీ చెన్‌పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్- బోపన్న జోడి 3-1 సెట్లతో సెయైన్ యిన్ పెంగ్- సింగ్ హూ యాంగ్ ద్వయంపై విజయం సాధించింది.
ఎనిమిది నిమిషాల్లోనే...
వెలుతురులేమి కారణంగా శనివారం కొనసాగిన సింగిల్స్ మ్యాచ్ చివరి సెట్‌ను ముగించేందుకు సోమ్‌దేవ్‌కు ఎంతో సేపు పట్టలేదు. 7-7తో కొనసాగిన ఈ నిర్ణాయక ఐదో సెట్‌లో మరో రెండు పాయింట్లను గెలవడం ద్వారా సోమ్‌దేవ్ 6-7 (4/7), 7-6 (7/3), 1-6, 6-2, 9-7తో టీ చెన్ ఆటను ముగించాడు. భారత్, తైపీ ఆటగాళ్ల మధ్య ఇది మూడో సమరం. డేవిస్ కప్ కంటే ముందు 2009లో జరిగిన మ్యాచ్‌లో, ఆసియా గేమ్స్ (2010)లోనూ భారత ఆటగాడే విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
డబుల్స్‌లోనూ భారత్‌దే జోరు
అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లోనూ భారత జోడి రోహన్ బోపన్న- సాకేత్ మైనేని అదరగొట్టింది. రెండు గంటల 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సాకేత్-బోపన్న ద్వయం 6-0, 6-7 (3/7), 6-3, 7-6 (7/2)తో సెయైన్ యిన్ పెంగ్- టింగ్ హూ యాంగ్ జంటను కంగుతినిపించింది. తొలి మ్యాచ్ ఆడుతోన్న సాకేత్ శక్తివంతమైన సర్వీస్‌లతో హడలెత్తించాడు. నెట్ వద్ద అప్రమత్తంగా కదులుతూ, చూడచక్కనైన రిటర్న్ షాట్‌లు సంధిస్తూ బోపన్నకు మంచి సహకారం అందించాడు.
నా విజయం తాలూకూ క్రెడిట్ జట్టు మొత్తానికి దక్కుతుంది. మ్యాచ్‌కు ముందు యూకీ నాపై ఒత్తిడి పెరగకుండా చూశాడు. అనవసర అంచనాలు పెంచకుండా సహచరులను కామ్‌గా ఉంచాడు. ఏదేమైనా వాళ్లంతా నాపై నమ్మకం పెట్టుకున్నారు. కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా నా ప్రదర్శనకు ఉపయోగపడింది
- సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్
సాకేత్ ఆడిన తీరు అద్భుతం. మా జోడి చక్కగా కుదిరింది. మేం ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంతటి సమన్వయం సాధించడం విశేషమే. సర్వీస్‌లోనూ నాకంటే అతని స్పీడే ఎక్కువ. ఈ వేగమే నెట్ దగ్గర నా పనిని సులువుచేసింది.
- రోహన్ బోపన్న