
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
111 ఏళ్ల తర్వాత బెల్జియం, 37 ఏళ్ల తర్వాత బ్రిటన్ డేవిస్ కప్ ఫైనల్లోకి ప్రవేశం
బ్రస్సెల్స్, గ్లాస్గో : సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘డేవిస్ కప్’లో ఈసారి బెల్జియం, బ్రిటన్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన సెమీఫైనల్లో బ్రిటన్ 3-2తో ఆస్ట్రేలియాపై విజయం సాధించగా... బ్రస్సెల్స్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెల్జియం 3-2తో అర్జెంటీనాను ఓడించింది. స్వదేశంలో ఈ ఏడాది నవంబరు 27 నుంచి 29 వరకు జరిగే ఫైనల్లో బెల్జియం... బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 115 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో 111 ఏళ్ల తర్వాత బెల్జియం ఫైనల్‌కు చేరుకుంది.
చివరిసారి బెల్జియం 1904లో జరిగిన ఫైనల్లో 0-5తో అమెరికా చేతిలో ఓడిపోయింది. మరోవైపు 37 ఏళ్ల తర్వాత బ్రిటన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చివరిసారి బ్రిటన్ 1978లో జరిగిన ఫైనల్లో 1-4తో అమెరికా చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండీ ముర్రే 7-5, 6-3, 6-2తో బెర్నాడ్ టామిక్‌ను ఓడించడంతో బ్రిటన్ 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో థనాసి కోకినాకిస్ (ఆస్ట్రేలియా) 7-5, 6-4తో డాన్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలిచినా ఫలితం లేకపోయింది.
అర్జెంటీనాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో బెల్జియం ప్లేయర్ స్టీవ్ డార్సిస్ గెలుపొంది తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డార్సిస్ 6-4, 2-6, 7-5, 7-6 (7/3)తో ఫెడెరికో డెల్బోనిస్‌ను ఓడించాడు. అంతకుముందు నాలుగో మ్యాచ్‌లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-3, 6-2, 6-1తో ష్వార్ట్‌జ్‌మన్‌పై గెలుపొంది స్కోరును 2-2తో సమం చేశాడు.