
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పాక్‌లో జరగాల్సిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ పోరు తటస్థ వేదికకు మారింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇస్లామాబాద్ నుంచి డేవిస్ మ్యాచ్‌లను తరలించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో పోరు నిర్వహణ కష్టమని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీఎఫ్ స్వతంత్ర భద్రతా సలహాదారులు నివేదిక ఇచ్చారు.
దాంతో తటస్థ వేదికపై ఈనెల 29, 30వ తేదీల్లో దాయాదుల సమరం జరుగుతుందని సోమవారం అధికారికంగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం నుంచి ఈవెంట్‌ను తరలిస్తే తటస్థ వేదికను ఎంపిక చేసే హక్కు ఆ దేశానికే కలి్పస్తారు. మరో ఐదు రోజుల్లో ఏ దేశంలో నిర్వహించేది పాకిస్తాన్ వెల్లడించాల్సి వుంటుంది. దీన్ని డేవిస్ కప్ కమిటీ ఆమోదిస్తుంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా రోహిత్ రాజ్‌పాల్ వ్యవహరిస్తాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ప్రకటించింది.