న్యూఢిల్లీ: ఆరేళ్ల తర్వాత డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించిన భారత్‌కు ఈ రౌండ్‌లో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి 14 వరకు సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో 2010 చాంపియన్ సెర్బియాతో భారత్ తలపడనుంది. సెర్బియా గనుక పూర్తి జట్టును బరిలోకి దించితే ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ఆటను భారత అభిమానులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. సింగిల్స్‌లో జొకోవిచ్‌తోపాటు ప్రపంచ 76వ ర్యాంకర్ దుసాన్ లాజోవిచ్, 90వ ర్యాంకర్ టిప్సరెవిచ్, 112వ ర్యాంకర్ విక్టర్ ట్రయెస్కీలతో సెర్బియా పటిష్టంగా ఉంది.
డబుల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ నెనాద్ జిమోనిచ్ కూడా ఆడే అవకాశముంది. ఇక భారత్ నుంచి సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న-సాకేత్ మైనేని బరిలోకి దిగవచ్చు. భారత్, సెర్బియాల మధ్య ఇప్పటివరకు డేవిస్‌కప్‌లో ముఖాముఖి పోరు ఒకేసారి జరిగింది. 2011లో సెర్బియాలోని నోవిసాద్‌లో జరిగిన వరల్డ్‌గ్రూప్ తొలి రౌండ్‌లో భారత్ 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ పోటీలో జొకోవిచ్ బరిలోకి దిగలేదు.
భారత్ x సెర్బియా
Published Wed, Apr 9 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement