సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి రెండు టైటిళ్లతో మెరిసింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సహజ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో టాప్‌సీడ్ ప్రతిభ ప్రసాద్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యతో జతకట్టి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో సహజ–సాయిదేదీప్య (తెలంగాణ) జంట 7–6 (7/5), 7–5తో టాప్ సీడ్ షాజిహా బేగం–షేక్ హుమేరా (తెలంగాణ) జోడీకి షాకిచ్చింది.
పురుషుల విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్‌కు నిరాశ ఎదురైంది. సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ 6–3, 4–6, 2–6తో భరత్ కుమారన్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో నిక్షీప్–జూడ్ రేమండ్ జంట 7–6 (7/5), 6–4తో కవిన్ మసిలమణి–భరత్ కుమారన్ జోడీపై విజయం సాధించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) కార్యదర్శి అశోక్ కుమార్ మఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీఏ సంయుక్త కార్యదర్శి వి. నారాయణదాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment