
సాక్షి, హైదరాబాద్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్‌లో ఆరో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ ఖాతాలో వేసుకుంది. భారత్‌కే చెందిన వైదేహి చౌదరీతో కలిసి రష్మిక డబ్ల్యూ 35 డబుల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్‌లో భాగంగా... థాయ్‌లాండ్ వేదికగా జరిగిన డబ్ల్యూ 35 టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–4, 6–3తో పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్)–యుకీ నైటో (జపాన్) ద్వయంపై విజయం సాధించింది.
మ్యాచ్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన భారత జోడీ... వరుస సెట్లలో విజృంభించి టైటిల్ చేజిక్కించుకుంది. 1 గంట 18 నిమిషాల పాటు సాగిన పోరులో రష్మిక–వైదేహి 2 ఏస్‌లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. 9 బ్రేక్ పాయింట్లు కాచుకున్న భారత ప్లేయర్లు... ఓవరాల్‌గా 61 పాయింట్లు సాధించి సునాయాసంగా గెలుపొందారు.
హైదరాబాద్‌కు చెందిన రష్మికకు ఇది రెండో డబ్ల్యూ 35 టైటిల్ కాగా... ఓవరాల్‌గా ఆరోది. 2024లో డబ్ల్యూ 35 ఇండోర్, 2023లో డబ్ల్యూ 15 అహ్మదాబాద్, డబ్ల్యూ 15 థాయ్‌లాండ్, డబ్ల్యూ 25 థాయ్‌లాండ్, 2022లో డబ్ల్యూ 15 గురుగ్రామ్ టోర్నమెంట్‌లలో రష్మిక డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఆరింట్లో నాలుగుసార్లు వైదేహి చౌదరీతో కలిసే రష్మిక విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment