ముర్రే, జొకోవిచ్ ముందంజ
వింబుల్డన్ టెన్నిస్
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, టాప్ సీడ్ జొకోవిచ్‌లు వింబుల్డన్ తొలి రౌండ్‌ను అలవోకగా అధిగమించారు. సోమవారం తొలి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ముర్రే 6-1, 6-4, 7-5 తేడాతో బెల్జియంకు చెందిన డేవిడ్ గాఫిన్‌పై గెలుపొందగా, జొకోవిచ్ 6-0, 6-1, 6-4తో ఆండ్రీ గులుబెవ్ (కజకిస్థాన్)పై సునాయాస విజయం సాధించాడు. గాఫిన్‌పై తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మూడో సీడ్ ముర్రేకు మూడో సెట్‌లో ప్రతిఘటన ఎదురైంది. మొత్తంగా రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే ఎనిమిది ఏస్‌లు, 28 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 2010 రన్నరప్, ఆరోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-7
(5-7), 6-1, 6-4, 6-3 తేడాతో రుమేనియాకు చెందిన విక్టర్ హనెస్కుపై గెలిచాడు. ఏడోసీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-0, 6-7
(3-7), 6-1, 6-1తో తన దేశానికే చెందిన కారెనో బుస్టాపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
నా లీ, క్విటోవా సునాయాసంగా..
మహిళల సింగిల్స్‌లో గతేడాది సెమీఫైనలిస్టు, రెండో సీడ్ చైనా క్రీడాకారిణి నా లీ, మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా, మాజీ ప్రపంచ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకాలు రెండో రౌండ్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ విజేత నా లీ తొలి రౌండ్‌లో 7-5, 6-2తో పోలెండ్‌కు చెందిన పౌలా కనియాపై గెలుపొందగా, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-3, 6-0తో తన దేశానికే చెందిన లవకోవాపై నెగ్గింది. 8వ సీడ్ అజరెంకా 6-3, 7-5తో బారోని (క్రొయేషియా)పై నెగ్గింది. ఐదుసార్లు చాంపియన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్‌లో 6-4, 4-6, 6-2తో మరియా టోరో ఫ్లొర్ (స్పెయిన్)పై గెలుపొందింది. కిరిలెంకో (రష్యా) 6-2, 7-6 (8-6)తో స్టీఫెన్స్ (అమెరికా)పై నెగ్గగా, స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3-6, 4-6 తేడాతో విక్‌మేయర్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది.