ముర్రేదే వింబుల్డన్
లండన్: బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే సొంత గడ్డపై రెచ్చిపోయాడు. ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా 2012లో రికార్డు సృష్టించిన ముర్రే .. రెండోసారి వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కెనడా ఆటగాడు ఏడోసీడ్ మిలోస్ రోనిచ్‌పై 6-4, 7-6, 7-6తో విజయం సాధించాడు. ఈ ఏడాది ఇంతకుముందు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్‌కు చేరినా జొకోవిచ్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ రెండోసీడ్ ఆటగాడు ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. కెరీర్‌లో ముర్రేకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ముర్రే.. 2013లో వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ మూడేళ్లకు మరోసారి వింబుల్డన్ ద్వారానే తన గ్రాండ్‌స్లామ్ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న రోనిచ్ చివరికి రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఇద్దరు ఆటగాళ్లు మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే సెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్‌ను నెగ్గాడు. ఇక రెండోసెట్ కూడా హోరాహోరీగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలుపుకోవడంతో సమానంగా పాయింట్లు సాధిస్తూ వెళ్లారు. దాంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ముర్రే తన జోరు ప్రదర్శించాడు. ఏకంగా రెండుసార్లు రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-3తో సెట్‌ను నెగ్గాడు. మరోవైపు మూడోసెట్‌ను కూడా టైబ్రేకర్ ద్వారా నెగ్గిన ముర్రే వింబుల్డన్ విజేతగా నిలిచాడు.