Milos Raonic
-
ప్రజ్నేశ్ ప్రత్యర్థి రావ్‌నిచ్
లండన్: భారత టెన్నిస్ నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్, 2016 రన్నరప్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్ మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబుల్స్ విభాగంలో భారత్ నుంచి దివిజ్ శరణ్, రోహన్ బోపన్న, లియాండర్ పేస్, జీవన్ నెడుంజెళియన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. ఒకే పార్శ్వంలో ఫెడరర్, నాదల్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ నాదల్ (స్పెయిన్) ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా అంతా సజావుగా సాగితే వీరిద్దరు సెమీఫైనల్లోనే తలపడతారు. మరో పార్శ్వంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ఉన్నాడు. తొలి రౌండ్లో లాయిడ్ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్; సుగిటా (జపాన్)తో నాదల్; కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతారు. -
మైదానంలోనే అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రస్టేషన్
-
వైరల్ : టెన్నిస్ కోర్టులో ఆటగాడి ఫ్రస్ట్రేషన్
మెల్బోర్న్ : ఓటమితో తీవ్ర అసహనానికి గురైన జర్మని టెన్నిస్ స్టార్ నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మైదానంలోనే తన ఫ్రస్టేషన్‌ను చూపించాడు. అందరి ముందే తీవ్ర చికాకుతో టెన్నిస్ రాకెట్‌ను ఎనిమిదిసార్లు నేలకేసి కొట్టాడు. తన కన్నా ఎక్కువ ర్యాంకైన ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో జ్వెరెవ్ ఘోరపరాజయాన్ని చూశాడు. దీంతో తన కోపాన్ని రాకెట్‌పై ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో జ్వెరెవ్ వరుస సెట్లలో 1-6, 1-6, 6(5)-7 తేడాతో మిలోస్ రావ్‌నిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను కోల్పోయిన జ్వెరెవ్ మూడో సెట్లో గట్టి పోటీనిచ్చినప్పటికి కెనడా స్టార్ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక ఏటీపీ వరల్డ్ టూర్-2018 టైటిల్ నెగ్గిన జ్వెరావ్.. మరోసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోవడంలో విఫలమయ్యాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఈ జర్మని ఆటగాడు 14 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయాడు. ఈ ఫ్రస్టేషన్‌తోనే తన రాకెట్‌ను నెలకొసి పదేపదే కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆ సమయంలో తనకు తీవ్ర కోపం వచ్చిందని, దాన్ని అదుపులో ఉంచుకోలేక తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టానని జ్వెరెవ్ మీడియాకు తెలిపాడు. తను చాలా చెత్తగా ఆడానని, తొలి రెండు సెట్లలో తన ఆట మరి దారుణమని చెప్పుకొచ్చాడు. తన ప్రత్యర్థి తనకన్నా మెరుగైన ప్రదర్శనకనబర్చాడని అభిప్రాయపడ్డాడు. -
మెయిన్ ‘డ్రా’కు యూకీ బాంబ్రీ అర్హత
లండన్: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఏటీపీ–500 ఫీవర్ ట్రీ చాంపియన్‌షిప్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అతను క్వాలిఫయింగ్ విభాగంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో యూకీ 6–4, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన యూకీ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ఆడతాడు. -
ఫెడరర్ @ 98
స్టుట్గార్ట్ (జర్మనీ): మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన మెర్సిడెస్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. 78 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ఫెడరర్ 6–4, 7–6 (7/3)తో ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై గెలుపొందాడు. ఫెడరర్ కెరీర్లో ఇది 98వ సింగిల్స్ టైటిల్‌కాగా... గ్రాస్ కోర్టులపై 28వది. చాంపియన్ ఫెడరర్‌కు 1,17,030 యూరోల (రూ. 92 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు, మెర్సిడెస్ కారు లభించింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరడంద్వారా సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో 36 ఏళ్ల ఫెడరర్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకోనున్నాడు. ‘ఇది ఘనమైన పునరాగమనం. మూడో ప్రయత్నంలో నేను ఈ టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి టాప్ ర్యాంక్ నాలో కొత్త ఉత్సాహం నింపుతుందో లేదో వేచి చూడాలి’ అని ఫెడరర్ అన్నాడు. కెరీర్ మొత్తంలో 148 ఫైనల్స్ ఆడిన ఫెడరర్ 98 ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, 50 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. అతను సాధించిన 98 టైటిల్స్‌లో 65 టైటిల్స్ విజయాలు వరుస సెట్లలో వచ్చాయి.1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఫెడరర్ అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఏడాదివారీగా ఫెడరర్ టైటిల్స్ సంఖ్య: 2001 (1); 2002 (3); 2003 (7); 2004 (11); 2005 (11); 2006 (12); 2007 (8); 2008 (4); 2009 (4); 2010 (5); 2011 (4); 2012 (6); 2013 (1); 2014 (6); 2015 (6); 2016 (0); 2017 (7); 2018 (3). -
హిట్... హిట్... ముర్రే
-
హిట్... హిట్... ముర్రే
ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మరోసారి ఆనందంతో హోరెత్తింది... మూడేళ్ల వ్యవధిలో మళ్లీ ఆ వేదిక పండగ చేసుకొంది... తమ ఇంటి బిడ్డ వింబుల్డన్ విజయంతో పులకించిపోయింది. సొంతగడ్డపై బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే సగర్వంగా రెండోసారి ట్రోఫీని అందుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ కరవు తీర్చుకుంటూ మూడో టైటిల్‌తో మురిశాడు. సెమీస్‌లో ఫెడరర్ని పడగొట్టిన రోనిచ్ తుది పోరులో మాత్రం ఆండీకి తలవంచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రోనిచ్‌ను ఓడించి ముర్రే తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. జొకోవిచ్ ప్రమాదం ముందే తప్పింది... ఫెడరర్‌తో కూడా తలపడాల్సిన అవసరం రాలేదు... ఇలాంటి బంగారంలాంటి అవకాశాన్ని ముర్రే ఒడిసి పట్టుకున్నాడు. తాను ఆడిన గత మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ ఓడిన తర్వాత దక్కిన ఈ విజయం ముర్రేకు కొత్త ఊపిరి పోసింది. చిన్న పిల్లాడికి ఆట వస్తువు దొరికినట్లుగా వింబుల్డన్ ట్రోఫీని గట్టిగా గుండెలకు హత్తుకోవడం, మ్యాచ్ గెలిచిన తర్వాత భావోద్వేగాలు ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేయడం చూస్తే అతను ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాడో అర్థమవుతుంది. ≈ రెండోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం ≈ ఫైనల్లో మిలోస్ రోనిచ్‌పై ఘన విజయం ≈ రూ. 17 కోట్ల 39 లక్షల ప్రైజ్‌మనీ సొంతం లండన్: వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-4, 7-6 (7/3), 7-6 (7/2)తో మిలోస్ రోనిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ముర్రే పూర్తి ఆధిక్యం కనబర్చాడు. రెండు, మూడు సెట్లు రోనిచ్ పోరాటంతో టైబ్రేక్‌కు చేరినా, అక్కడ ముర్రేకు అనాయాస విజయం దక్కింది. 2013లో తొలిసారి వింబుల్డన్ నెగ్గిన ముర్రే ఇక్కడ టైటిల్ సాధించడం రెండోసారి. తద్వారా బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (3 సార్లు) తర్వాత కనీసం రెండుసార్లు విజేతగా నిలిచిన రెండో ఆటగాడిగా అతను తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. పెర్రీ గెలిచిన 80 ఏళ్ల తర్వాత ముర్రేకు మరో ట్రోఫీ దక్కింది. అతని కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో అతను యూఎస్ ఓపెన్ నెగ్గాడు. విజేతగా నిలిచిన ఆండీ ముర్రేకు 20 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 39 లక్షలు)... రన్నరప్ రోనిచ్కు 10 లక్షల పౌండ్లు (రూ. 8 కోట్ల 69 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పోటాపోటీగా... తన 11వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముర్రే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి సెట్ ఆరంభంలో ముర్రే, రోనిచ్లు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. ఫలితంగా స్కోరు 3-3తో నిలిచింది. అనంతరం ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన ముర్రే ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీనిని కొనసాగించిన అతను, పదో గేమ్‌ను ఫోర్‌హ్యాండ్ వాలీ విన్నర్‌తో ముగించి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్లో కూడా హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరు ఆటగాళ్లూ సర్వీస్‌లు కాపాడుకోగా ఒక దశలో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో చెలరేగిన ఆండీ సెట్‌ను కొల్లగొట్టాడు. ముర్రే జోరు... చివరి సెట్ కూడా పోటాపోటీగానే సాగింది. ఎనిమిది గేమ్‌లలో ఇద్దరు ఆటగాళ్లూ నువ్వా నేనా అనే రీతిలో ఆడారు. దీంతో 4-4 వరకు స్కోర్ సాగింది. ఈ దశలో తొమ్మిదో గేమ్‌లో వరుసగా రెండు ఏస్‌లు కొట్టి ముర్రే తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. రోనిచ్ కూడా తగ్గకపోవడంతో 6-6 స్కోరుతో మూడో సెట్ కూడా టైబ్రేక్ వరకు వెళ్లింది. ఈ దశలో వరుస పాయింట్లతో 5-0తో ముందంజ వేసిన బ్రిటన్ స్టార్ వేగంగా విజయం వైపు దూసుకుపోయాడు. రోనిచ్ కొట్టిన బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తాకడంతో ముర్రే విజయం ఖరారైంది. రోనిచ్ చేతులారా... ఈ ఏడాది వింబుల్డన్‌లో ఫైనల్‌కు ముందు రోనిచ్ ఏకంగా 137 ఏస్‌లు కొట్టాడు. అయితే ఫైనల్లో మాత్రం కేవలం 4 ఏస్‌లకే పరిమితమయ్యాడు. చివరకు వింబుల్డన్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సర్వ్ (గంటకు 147 మైళ్ల వేగం) కూడా అతడికి పాయింట్ తీసుకురాలేకపోవడం విశేషం. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అతనిలో కనిపించింది. పాయింట్లు సాధించే అవకాశం లభించిన చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఆడి దానిని కాలదన్నుకున్నాడు. ముర్రే మాత్రం ఎక్కడా తడబాటుకు లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. చక్కటి రిటర్న్‌లతో ప్రత్యర్థికి సమాధానమిచ్చాడు. ముర్రే చేసిన 6 తప్పులతో పోలిస్తే రోనిచ్ ఏకంగా 21 అనవసర తప్పిదాలు చేయడం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మ్యాచ్ మొత్తంలో ఒకే సారి రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే, తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. గత పది ఫైనల్స్‌లో ఫెడరర్, జొకోవిచ్లతోనే తలపడిన ముర్రే, ఈసారి కొత్త ఆటగాడికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ‘నాకు సంబంధించి ప్రతీ ఏడాది ఈ టోర్నమెంట్ ప్రత్యేకమే. ఇక్కడ కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. బాధించే ఓటములూ ఉన్నాయి. బహుశా ఆ పరాజయాల వల్లే కావచ్చు వింబుల్డన్ టైటిల్ గెలుపు మరింత గొప్పగా కనిపిస్తోంది. ఈ ట్రోఫీని మళ్లీ చేతుల్లోకి తీసుకోవడం గర్వంగా ఉంది. క్రితంసారి గెలిచినప్పుడు అప్పటి ఒత్తిడి వల్ల నా విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. ఈ సారి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. నా కోసం వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. వింబుల్డన్ ఫైనల్ ఆడగలిగాను కానీ దేశ ప్రధానిని కావాలనే కోరిక మాత్రం నాకు లేదు. అది చాలా పెద్ద బాధ్యత’ - ఆండీ ముర్రే -
ముర్రేదే వింబుల్డన్
లండన్: బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రే సొంత గడ్డపై రెచ్చిపోయాడు. ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా 2012లో రికార్డు సృష్టించిన ముర్రే .. రెండోసారి వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో కెనడా ఆటగాడు ఏడోసీడ్ మిలోస్ రోనిచ్‌పై 6-4, 7-6, 7-6తో విజయం సాధించాడు. ఈ ఏడాది ఇంతకుముందు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఫైనల్‌కు చేరినా జొకోవిచ్ చేతిలోనే పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ రెండోసీడ్ ఆటగాడు ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. కెరీర్లో ముర్రేకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ముర్రే.. 2013లో వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ మూడేళ్లకు మరోసారి వింబుల్డన్ ద్వారానే తన గ్రాండ్‌స్లామ్ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న రోనిచ్ చివరికి రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఇద్దరు ఆటగాళ్లు మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముర్రే సెట్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 6-4తో సెట్‌ను నెగ్గాడు. ఇక రెండోసెట్ కూడా హోరాహోరీగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు తమ సర్వీస్‌లను నిలుపుకోవడంతో సమానంగా పాయింట్లు సాధిస్తూ వెళ్లారు. దాంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ముర్రే తన జోరు ప్రదర్శించాడు. ఏకంగా రెండుసార్లు రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-3తో సెట్‌ను నెగ్గాడు. మరోవైపు మూడోసెట్‌ను కూడా టైబ్రేకర్ ద్వారా నెగ్గిన ముర్రే వింబుల్డన్ విజేతగా నిలిచాడు. -
ముర్రే X రోనిచ్
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ 80 ఏళ్ల తర్వాత రెండోసారి వింబుల్డన్ టైటిల్ సాధించిన రెండో బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందడానికి ఆండీ ముర్రే... కెనడా తరఫున తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించేందుకు మిలోస్ రోనిచ్... ఆదివారం జరిగే వింబుల్డన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ముర్రే తన స్థాయికి తగ్గట్టు ఆడితే రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను అందుకోవడం కష్టమేమీకాదు. బ్రిటన్ తరఫున ఫ్రెడ్ పెర్రీ (1934, 1935, 1936లలో) మాత్రమే మూడుసార్లు వింబుల్డన్ టైటిల్ సాధించాడు. మరోవైపు 2002 తర్వాత ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్ లేకుండా తొలిసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ముఖాముఖి రికార్డులో ముర్రే 6-3తో రోనిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఈ ఇద్దరూ రెండుసార్లు (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 యూఎస్ ఓపెన్) తలపడగా... రెండుసార్లూ విజయం ముర్రేనే వరించింది. సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
రోనిచ్ సంచలనం
* సెమీస్‌లో ఫెడరర్‌పై విజయం * తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి లండన్: కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే కల ఫెడరర్‌కు కలగానే మిగిలిపోతుందేమో! కొన్నేళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన నొవాక్ జొకోవిచ్ అడ్డు లేకపోయినా... ఈ స్విట్జర్లాండ్ స్టార్ వింబుల్డన్‌లో తడబడ్డాడు. కెనడా యువ కెరటం మిలోస్ రోనిచ్తో జరిగిన ఐదు సెట్ల పోరాటంలో ఈ మాజీ చాంపియన్ చేతులెత్తేశాడు. కీలక సమయంలో కళ్లు చెదిరే షాట్లు, తిరుగులేని సర్వీస్‌లతో హడలెత్తించిన రోనిచ్ తన కెరీర్లో చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి కెనడా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. సెంటర్ కోర్టులో శుక్రవారం 3 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఆరో సీడ్ రోనిచ్ 6-3, 6-7 (3/7), 4-6, 7-5, 6-3 మూడో సీడ్ ఫెడరర్‌ను ఓడించాడు. ఇప్పటిదాకా వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన 10 సార్లూ ఫెడరర్‌కు ఓటమి ఎదురుకాలేదు. కానీ ఈ స్విస్ స్టార్ జైత్రయాత్రకు రోనిచ్ తెరదించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 98 కేజీల బరువున్న రోనిచ్ తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో ఫెడరర్ పుంజుకున్నాడు. కచ్చితమైన సర్వీస్‌లకు తోడు బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. 5-4తో ఆధిక్యంలో ఉన్న దశలో రోనిచ్ సర్వీస్‌లో ఫెడరర్‌కు మూడు సెట్ పాయింట్లు వచ్చాయి. అయితే రోనిచ్ నాలుగుసార్లు సెట్ పాయింట్ కాపాడుకొని గేమ్ గెలిచి స్కోరును 5-5తో సమం చేశాడు. కానీ టైబ్రేక్‌లో ఫెడరర్ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో ఏడో గేమ్‌లో రోనిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. అయితే 12వ గేమ్‌లో ఫెడరర్ పేలవమైన సర్వీస్‌లకు తోడు రోనిచ్ అద్భుత ఆటతీరు కారణంగా ఈ కెనడా ప్లేయర్ బ్రేక్ సాధించి సెట్‌ను 7-5తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో రోనిచ్ మరింత దూకుడుగా ఆడగా... అలసిపోయిన ఫెడరర్ ఎదురునిలువలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రోనిచ్ 25 ఏస్‌లు.. ఫెడరర్ 16 సంధించారు. రోనిచ్ 11 డబుల్ ఫాల్ట్‌లు చేయగా... ఫెడరర్ ఐదుకే పరిమితమయ్యాడు. రోనిచ్ సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసే అవకాశం రాగా ఫెడరర్ ఒకసారి మాత్రమే సఫలమయ్యాడు. మరోవైపు ఫెడరర్ సర్వీస్‌ను రోనిచ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. రోనిచ్ 75 విన్నర్స్ కొట్టగా... ఫెడరర్ 49 విన్నర్స్‌తో సరిపెట్టుకొని మూల్యం చెల్లించుకున్నాడు. ముగిసిన భారత్ పోరు ఈసారి వింబుల్డన్ టోర్నీలో భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మూడో రౌండ్లో నిష్ర్కమించింది. గురువారం రాత్రి ఆలస్యంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్-హింగిస్ జంట 6-3, 3-6, 2-6తో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)-హితెర్ వాట్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గతేడాది హింగిస్‌తో కలిసి సానియా మహిళల డబుల్స్ విభాగంలో, పేస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్స్ సాధించారు. సెరెనా X కెర్బర్ నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే పట్టుదలతో సెరెనా... స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాలనే తపనతో ఎంజెలిక్ కెర్బర్... శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ సమరానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిన సెరెనా వింబుల్డన్‌లో విజృంభిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి సంచలనం సృష్టించిన కెర్బర్ అదే ఫలితాన్ని వింబుల్డన్‌లో పునరావృతం చేస్తుందో లేదో..? సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
ఫెడరర్‌కు షాక్
లండన్: నాలుగేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెడరర్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ప్రపంచ నం. 1 నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోనే వెనుదిరగడంతో ఈసారి జరుగుతున్న వింబుల్డన్ కచ్చితంగా నెగ్గుతాడని భావించిన ఫెడరర్ సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాడు. మూడోసీడ్‌గా వింబుల్డన్ బరిలో ఉన్న ఫెడరర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆటగాడు మిలోస్ రౌనిక్ (కెనడా) చేతిలో 3–6, 7–6, 6–4, 5–7, 3–6తో పరాజయం పాలయ్యాడు. 2010 నుంచి గ్రాండ్‌స్లామ్‌లు ఆడుతున్న రౌనిక్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. మ్యాచ్‌లో తొలిసెట్‌ను ఓడిపోయిన ఫెడరర్ రెండోసెట్లో పుంజుకున్నాడు. ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌ను నెగ్గిన ఫెడరర్ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మూడోసెట్లో 7వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో ఆధిక్యం సంపాదించాడు. నాలుగోసెట్ హోరాహోరీగా జరగగా.. ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రౌనిక్ మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక ఐదోసెట్ను అలవోకగా నెగ్గిన రౌనిక్ ఫైనల్లో అడుగుపెట్టాడు. -
రాయనిక్ సంచలన విజయం
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ప్రపంచ నాల్గో ర్యాంక్ ఆటగాడు, స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిష్క్రమించాడు. ప్రి క్వార్టర్స్ ఫైనల్లో భాగంగా సోమవారం మిలాస్ రాయనిక్(కెనడా)తో జరిగిన పోరులో వావ్రింకా ఓటమి పాలయ్యాడు. రాయనిక్ 6-4, 6-3, 5-7, 7-4, 6,3 తేడాతో వావ్రింకాను మట్టికరిపించి క్వార్టర్స్ కు చేరాడు. గతంలో వీరిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ లో తలపడిన నాలుగుసార్లు వావ్రింకానే విజయం సాధించగా, ఈసారి మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రాయనిక్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మూడు గంటల 44 నిమిషాల పాటు జరిగిన పోరులో 24 ఏస్ లను సంధించిన రాయనిక్.. వావ్రింకాకు చుక్కలు చూపించాడు. దీంతో 2014 ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇప్పటివరకూ కనీసం క్వార్టర్స్ ఫైనల్ కు చేరిన వావ్రింకా విజయాలకు బ్రేక్ పడింది. -
రోజర్ ఫెదరర్‌కు షాక్
బ్రిస్బేన్: ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజరర్ ఫెదరర్ కు ఊహించిన షాక్ తగిలింది. బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఫెదరర్ .. కెనడా ఆటగాడు మిలాస్ రాయినిక్ దాటికి తలవంచాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఫెదరర్ 4-6, 4-6 తేడాతో రాయినిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో గతేడాది ఇదే టోర్నీ ఫైనల్లో ఎదురైన ఓటమికి రాయినిక్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరోవైపు ముఖాముఖిపోరులో రాయినిక్ తన విజయాల సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఇప్పటివరకూ వీరి మధ్య 11 మ్యాచ్ లు జరగ్గా రెండింట రాయినిక్ విజయం సాధించాడు. ఈ రోజు జరిగిన తుదిపోరులో ఆది నుంచి ఫెదరర్‌కు రాయినిక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రత్యేకంగా సర్వీసుల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన రాయినిక్.. నెట్ వద్ద కూడా అంతే దూకుడుగా ఆడి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తొలి సెట్ ఐదో గేమ్ లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించి ఆధిక్యం దూసుకువెళ్లిన ఫెదరర్.. ఆ తరువాత మరో రెండు పాయింట్లను సాధించడానికి తొమ్మిది గేమ్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు తన సర్వీసులతో ఫెదరర్ ను తీవ్ర ఇబ్బందులు పెట్టిన రాయినిక్ పాయింట్లను చేజిక్కించుకుని తొలి సెట్ ను కైవసం చేసుకున్నాడు. అనంతరం రెండో సెట్ లో ఏడో గేమ్ వరకూ ఫెదరర్ అడ్వాంటేజ్ సాధించలేకపోవడంతో మ్యాచ్ రెండు సెట్లతోనే ముగిసింది. ఈ మ్యాచ్ మొత్తానికి ఒకే ఒక బ్రేక్ పాయింట్ ను ఎదుర్కొన్న రాయినిక్.. ఈ ఏడాది టైటిల్ తో శుభారంభం చేయాలనుకున్న ఫెదరర్ కలను వమ్ము చేశాడు. -
ఫెడరర్ 21వ సారి...
సిన్సినాటి: ఈ ఏడాది ఒక్క సింగిల్స్ టైటిల్ మాత్రమే నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ నిరాశజనక ఫ్రదర్శన కొనసాగుతోంది. గతంలో ఆరుసార్లు సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెల్చుకున్న ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 7-5, 4-6, 3-6తో ఓడిపోయాడు. నాదల్‌తో 31వ సారి తలపడిన ఫెడరర్‌కిది 21వ పరాజయం కావడం గమనార్హం. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు. జొకోవిచ్ గనుక సిన్సినాటి టైటిల్ గెలిచిఉంటే అన్ని మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ‘అమెరికా ఆజానుబాహుడు’ జాన్ ఇస్నెర్ 7-6 (7/5), 3-6, 7-5తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్‌లో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-4తో ఆండీ ముర్రేను ఓడించాడు.